HIGH COURT ON GOVT EMPLOYEES PETITION : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం నోటీసు ఇవ్వలేదని అభిప్రాయపడిన కోర్టు.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా నోటీసు ఉందని పేర్కొంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చట్టం తీసుకురావాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ, తదితరులు రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఆర్. సూర్యనారాయణ, ఇతర నాయకులకు గత నెల 23న షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 72, రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవోకి విరుద్ధమనే విషయాన్నే తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
2021 జులై ఎనిమిదో తేదీన ఇదే విషయమై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను కలిసి వినతి పత్రం అందజేసినా ఫలితం లేకపోవడంతోనే గవర్నర్‌ను సంప్రదించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే గవర్నర్‌ను కలిశామని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొంది. తమపై తదుపరి చర్యలు అమలు నిలుపు దల చేయాలని హైకోర్టును సూర్యానారాయణ అభ్యర్ధించారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అలాగే ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీ చదవండి: