HC serious on Advisors Appointment: సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టరు, పోలీసు కమిషనర్, తహశీల్దార్లకు సైతం సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడుందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కాని..ప్రభుత్వశాఖలకు సలహాదారులేంటని సూటిగా ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి రాజ్యాంగబద్దత ఉందా లేదా అనే విషయాన్ని తేలుస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 19 కి వాయిదా వేసింది.
జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారునిగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖరరావు.. గత ఏడాది ఆగస్టులో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం..సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది . తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. దేవాదాయశాఖకు సలహాదారులను నియమించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదన్నారు. ఆయన నియామకానికి ఏ అర్హతలను కొలమానంగా పరిగణనలోకి తీసుకుందో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. నియామక ప్రక్రియ, విధివిధానాలేమీ పాటించడం లేదని..నచ్చిన వారికి పదవులు కట్టబెడుతోందన్నారు. ముఖ్యమంత్రి,మంత్రులకు సలహాదారుల్ని నియమించడాన్ని..ప్రభుత్వశాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకేలా చూడలేమని విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వశాఖలకు సీనియర్
ఐఏఎస్ అధికారులు నేతృత్వం వహిస్తుంటారని.. వారి కంటే బయటి నుంచి వచ్చిన వ్యక్తులు మెరుగైన సలహాలు ఏవిధంగా ఇస్తారని నిలదీసింది. ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులకు ఓ క్యాడర్ ఉంటుందని, వారి విషయంలో జీతభత్యాల చెల్లింపునకు నియమ నిబంధనలు ఉంటాయని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా సలహాదారుల్ని ఏ క్యాడర్ కింద నియమిస్తున్నారని ప్రశ్నించింది. ప్రజాధనం నుంచి ఏవిధంగా జీతభత్యాలు చెల్లిస్తున్నారని..వారి నియామక విధివిధానం ఏంటని.. ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకం విషయంలో రాజ్యాంగబద్ధత ఉందా? లేదా? అనే విషయాన్ని తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలేమిటో తేలుస్తామంది. రాష్ట్రప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులున్నారు? ప్రభుత్వ శాఖల వారీగా ఎంత మందిని నియమించారు? వారి నియామకం విషయంలో విధివిధానాలేంటి? పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్‌ను ఆదేశించింది.
ఓ పీఠాధిపతి సలహామేరకు.. జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమించామని ఏజీ ఇచ్చిన వివరణను హైకోర్టు ఆక్షేపించింది. పీఠాధిపతులున్నది ప్రభుత్వాల్ని నడపడానికి కాదని, వారు దేవాలయాల పాలన వ్యవహారం వరకే పరిమితం అవ్వడం ఉత్తమం అని వ్యాఖ్యానించింది. ఇష్టానుసారంగా సలహాదారుల నియామక విషయం చిన్నదేమి కాదంది. దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ నియామకంపై.. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు ఆయన సలహాదారుగా కొనసాగేందుకు వెసులుబాటు ఇచ్చింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు ఆయన నియామకం లోబడి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలుచేస్తూ దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రస్తుత పిటిషన్‌తో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఇవీ చదవండి: