HC On RTC Employees Petetion: కోర్టుధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, ఐపీఎస్ అధికారి ద్వారక తిరుమలరావులతో పాటు మరో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఫీల్డ్ మెన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. వారిని రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకపోవటంతో పిటీషనర్లు కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా తమ ఆదేశాలను అమలుచేయలేదని అప్పటి రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావులకు నెలరోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ నెల 16 లోపు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా బుధవారం జరిగిన విచారణలో అధికారులపై వేసిన శిక్షను నిలుపుదల చేసింది.
ఇదీ జరిగింది.. ఫీల్డ్‌మెన్‌గా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన బీ.సురేంద్రతో పాటు మరో ముగ్గురు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. గతంలో క్రమబద్ధీకరించిన జూనియర్లతో సమానంగా పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని, వడ్డీతో సహా అప్పటి నుంచి జీతాన్ని లెక్కించి ఇవ్వాలని 2022 ఆగస్టు 1న అధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే దానిని అమలు చేయపోవడంతో దాఖలైన కోర్టుధిక్కరణ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అధికారులకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు.
ఆ తీర్పును సవాలు చేస్తూ శిక్ష పడ్డ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో వారి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్, సాల్మన్‌రాజు వాదనలు వినిపించారు. జూనియర్ల సర్వీసును క్రమబద్ధీకరించారని చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని వారు హైకోర్టులో వాదించారు. ఆ జూనియర్లు వేసిన పిటిషన్‌పై తుది విచారణ చేసిన హైకోర్టు దానిని కొట్టేయాలని, సింగిల్ జడ్జి ఇచ్చిన జైలు శిక్ష తీర్పు అమలును నిలుపుదల చేయాలని వారు కోరారు.
ఇవీ చదవండి: