తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్ఎస్జీ తరఫున అసిస్టెంట్ సోలిసిటరల్ జనరల్ క్రిష్ణమోహన్ వాదనలు వినిపించారు. చంద్రబాబు ఇంట్లో, కార్యాలయంలో ఉన్నప్పుడు ఆయన భద్రత చూసుకోవాల్సింది స్థానిక పోలీసులేనని, ఎన్ఎస్జీకి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు బయటకు వెళ్తున్నప్పుడు, జనాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎన్ఎస్జీ ఆయనకు భద్రత ఇస్తుందని స్పష్టం చేశారు.
ఇటీవల కేంద్ర భద్రతా సమీక్ష కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ... చంద్రబాబుకి కేంద్రం నుంచి ఇస్తున్న ఎన్ఎస్జీ కమాండోలను తగ్గించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు సొలిసిటరల్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుకి మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ప్రాణహాని ఉందని... అందుకే 2004-2014 మధ్య ప్రతిపక్ష నేత హోదాలో కల్పించిన భద్రతను కల్పించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు.
గతంలో ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటే... ఇప్పుడు ఒకర్నిమాత్రమే ఇచ్చారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ముగ్గురి వాదనలు విన్న న్యాయమూర్తి... తీర్పు రిజర్వ్‌లో ఉంచారు.
ఇదీ చదవండీ...