HIGH COURT FIRES ON HIGHER OFFICIALS : కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు ఇంటర్మీడియట్ విద్య పూర్వ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ప్రస్తుత ఐజీ వి.రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌లపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను అమలు చేయలేదంటూ వారికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది.
సకాలంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై వారు క్షమాపణలు చెప్పారు. ఇక మీదట జాగ్రత్త వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అధికారుల వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో జైలు శిక్ష విధింపును సవరించి హైకోర్టు పని గంటలు ముగిసే (4.15) వరకూ కోర్టులోనే నిల్చుని ఉండాలని శిక్ష విధిస్తూ మౌఖిక ఆదేశాలిచ్చింది.
న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు కీలక తీర్పు చెప్పారు. దీంతో ఇద్దరు అధికారులూ భోజన విరామ సమయం మినహా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకూ చాలా సేపు కోర్టు హాలులో నిలబడ్డారు. మరోవైపు ఈ తీర్పుపై అత్యవసరంగా వారు ధర్మాసనం ముందు అప్పీలు చేయగా.. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ కేసు నేపథ్యం..
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని వీఈసీ జూనియర్ కళాశాలలో (ఎయిడెడ్) పార్ట్ టైం లెక్చరర్‌గా పని చేస్తున్న సాంబశివరావు తన సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ 2016లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ సర్వీసును క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశిస్తూ 2020 మార్చి 5న కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయకపోవడంతో సాంబశివరావు 2020 సెప్టెంబరులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇంటర్మీడియట్ విద్య అప్పటి కమిషనర్ వి.రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఉద్దేశపూర్వకంగా అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తప్పుబట్టింది. ఓసారి కౌంటర్ వేస్తూ పిటిషనర్ అర్హులు కాదని, మరో కౌంటర్ వేస్తూ 2022 ఏప్రిల్‌లో సర్వీసును క్రమబద్ధీకరించామని పేర్కొనడాన్ని ఆక్షేపించింది. ఉద్దేశపూర్వంగా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులు విలువ లేని ఆదేశాలుగా మిగిలిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
పోలీసులను పిలవండి..
బుధవారం అధికారులిద్దరూ కోర్టుకు హాజరయ్యారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అవి సదుద్దేశంతో చెప్పినవిగా లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వాటిని అంగీకరించలేమన్నారు. రిట్ అప్పీలు, రివ్యూ పెండింగ్‌లో ఉన్నాయనే కారణాలను సాకుగా చూపుతూ కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు వ్యూహాలు రచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి ఆదేశాలను అమలు చేయని అధికారులపై కనికరం చూపితే తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అవుతుందన్నారు. నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అధికారులు రామకృష్ణ, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకునేందుకు తుళ్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు భద్రతా వ్యవహారాలు చూసే ఎస్‌పీఎఫ్‌కు సూచించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అధికారుల తరఫున న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. తీర్పు అమలును రెండు రోజులు నిలిపేయాలని కోరారు.
ఈ రోజే అప్పీలు దాఖలు చేసుకుంటామని చెప్పగా.. న్యాయమూర్తి స్పందిస్తూ.. తీర్పు అమలును ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణకు ధర్మాసనం ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. మీకు నచ్చినప్పుడు అడిగితే విచారణకు అనుమతిస్తారులే అనేదే మీ ధైర్యమా.. అని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయనందుకు వారిలో ఏ కోశానా పశ్చాత్తాపం కనిపించడం లేదని, న్యాయస్థానాలపై గౌరవం ఉంటే వారి ప్రవర్తన వేరేగా ఉండేదని పేర్కొన్నారు. దీంతో అధికారులిద్దరూ క్షమాపణలు చెప్పారు.
విద్యాశాఖకు ఐఆర్‌ఎస్ అధికారి ఎందుకు?
ఐఆర్‌ఎస్ అధికారి, ఇంటర్మీడియట్ విద్య పూర్వ కమిషనర్ వి.రామకృష్ణ స్వయంగా వివరణ ఇస్తూ.. కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగినందుకు క్షమాపణలు తెలిపారు. మీరు ఐఏఎస్ అధికారా అని న్యాయమూర్తి అడగ్గా.. ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసు) అధికారినని చెప్పారు.
న్యాయమూర్తి స్పందిస్తూ.. ఐఏఎస్‌ల కొరత ఉందా? విద్యాశాఖలోకి డిప్యూటేషన్‌పై ఎందుకు వచ్చారు? తగినంతమంది ఐఏఎస్‌లు ఉన్నప్పుడు ఐఆర్‌ఎస్ నుంచి తేవడం ఎందుకని ఘాటుగా వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పడం, వారి వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జైలు శిక్ష తీర్పును సవరిస్తున్నామని చెబుతూ బుధవారం పని గంటలు ముగిసే వరకూ కోర్టు హాలులోనే నిలబడాలని ఆదేశించారు.
* అనంతరం ఇరువురు అధికారులూ ధర్మాసనం ముందు బుధవారం అత్యవసరంగా అప్పీలు వేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం 2.55 గంటలకు విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇవీ చదవండి: