High Court Comments on Poonam Malakondaiah: కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకానొక దశలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసేందుకు సిద్ధపడింది. 'పిటిషనర్‌కు జీతం చెల్లించమని న్యాయస్థానం ఆదేశాలిస్తే పట్టించుకోరా. కోర్టు ఉత్తర్వులంటే అంత నిర్లక్ష్యమా? జీతం చెల్లించండి అని మిమ్మల్ని యాచించాలా? 2018 నుంచి జీతం చెల్లించకుండా పిటిషనర్‌తో పనిచేయించుకుంటున్నారా? ఈ వ్యవహారంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, అకౌంటెంట్ జనరల్‌ను కోర్టుకు పిలిపిస్తాం. రాజ్యాంగబద్ధ కోర్టు కంటే మీరే ఎక్కువ అని భావిస్తున్నారా? అసెంబ్లీకి వెళ్లాల్సిన పని ఉండి.. కోర్టుకు రాలేనప్పుడు ముందుగా అనుమతి పిటిషన్ దాఖలు చేయాలని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌కు తెలీదా?' అని తీవ్రంగా మండిపడింది.
శాసనసభ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం ఉండటంతో పూనం మాలకొండయ్య కోర్టు విచారణకు రాలేకపోయారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్బీడబ్ల్యూ ఇవ్వొద్దని పదేపదే బతిమాలారు. తదుపరి విచారణకు హాజరు అవుతారని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.
ఆ రోజు విచారణకు పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్.. వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉపకులపతి కె.బాబ్జి, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ టి. మురళీమోహన్ హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.గంగారావు, జస్టిన్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విజయవాడ దంత వైద్యకళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనకు కొన్నేళ్లుగా హైకోర్ట్ ఆదేశాలున్నప్పటికీ జీతం చెల్లించకపోవడంపై టి.సుజాత అనే ఉద్యోగి 2018లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న విచారణ జరిపిన ధర్మాసనం.. వైద్యారోగ్యశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్ కె.బాబ్జి, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ టి. మురళీమోహన్ హాజరుకు ఆదేశించింది.
తాజాగా జరిగిన విచారణకు మురళీమోహన్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. మిగిలిన వారు హాజరు కాకపోవడంతో ధర్మాసనం తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. పూనం మాలకొండయ్య హైకోర్టుకు ముందుగా రావాలనుకున్నారని తర్వాత అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. హాజరు నుంచి మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేశామన్నారు. వైద్య విద్య డైరెక్టర్‌గా బాబ్జి ప్రసుతం పదవీ విరమణ చేశారని, ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా పని చేస్తున్నారన్నారు. ఆయనకు నోటీసు అందలేదన్నారు. తదుపరి విచారణకు హాజరు అవుతారన్నారు.
ఇవీ చదవండి: