గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సగటున 27.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యడ్లపాడు 75, గుంటూరు నగరంలో 73 , మాచర్లలో 73 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
నగరంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్లు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హనుమయ్య కంపెనీ, చుట్టుగుంట, లక్ష్మిపురం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వర్షం కారణంగా ఎన్టీఆర్ స్టేడియం బురదమయమైంది. ఇక్కడి రైతుబజార్లో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గుంటూరు నగరంలోని చుట్టుగుంట సమీప ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పక్కనే డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. వర్షం కురిసిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పటం లేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి , ఇళ్లలోకి వస్తే వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. జిల్లాలోని మాచవరం, మాచర్ల, అమరావతి, తుళ్లూరు, బాపట్ల, మంగళగిరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: 'చైనా నిఘాను తప్పించుకునే అతిపెద్ద ఆయుధం అదే'