Weather Updates in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లుండి వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత ఉత్తర దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా ఈ తుపాను వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రానికి ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే తుపాన్ ప్రభావం ఉండకపోయినప్పటికీ అల్పపీడనం, వాయుగుండం ప్రభావం కొంత మేర ఉండవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ఒకవేళ వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తమ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అత్యవసర సాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్ చేయాలని సూచించింది.
రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు: దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ సూచించింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లా, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఇవీ చదవండి: