Heat Waves in AP: ఏపీలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 478 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో ఉష్ణగాలులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆదివారం నుంచి రాయలసీమ జిల్లాల్లో ఎండ వేడి పరిస్థితులు తగ్గే సూచనలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఈ నెల 19 నుంచి 21 తేదీ వరకూ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు బిపర్ జాయ్ తుపాను ప్రభావంతో నైరుతీ రుతుపవనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఏపీలోని శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్ వరకూ నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. రేపటి నుంచి తేదీ నుంచి ఈ నైరుతి పవనాలు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలోనే నమోదు అవుతున్నాయి. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతారణశాఖ తెలిపింది. పార్వతీపురం మన్యంలో 44.87 డిగ్రీలు, విజయనగరం 44, అనకాపల్లి 43.9, అల్లూరి 42.7, తూర్పుగోదావరి 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏలూరు 42.2, ఎన్టీఆర్ 41.9, విశాఖపట్నం 41.3, గుంటూరు 41, బాపట్ల 41, పలనాడు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
కాగా.. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయని.. వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు.. కేరళ, కర్ణాటక, తమిళనాడు తీరాన్ని తాకగా.. తాజాగా ఏపీలోకి ప్రవేశించాయని.. వాతావరణ కేంద్రం ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కొన శ్రీహరి కోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపర్ జాయ్' తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.