గుంటూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో వైకాపా 44 స్థానాల్లో విజయం సాధించడంతో పాలకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థులు కొలువుదీరనున్నారు. గుంటూరు నగర మేయరుగా కావటి మనోహర్ నాయుడు పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికలకు ముందు అభ్యర్థిని ప్రకటించకుండా వైకాపా బరిలోకి దిగింది. ఆపార్టీ తరపున తొలి నుంచి మేయర్ పీఠం కోసం కావటి మనోహర్ నాయుడు, పాదర్తి రమేశ్ గాంధీ పోటీ పడ్డారు.
సామాజిక సమీకరణాలు, జిల్లాలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థుల ప్రకటన తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం మేయర్ పదవికాలాన్ని ఇద్దరికి పంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలుత కావటి మనోహర్ నాయుడుకు అవకాశం ఇవ్వగా తర్వాత పాదర్తి రమేశ్ గాంధీకి అవకాశం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో మేయర్ ఎన్నిక లాంఛనమే. కోన్ని రోజులుగా మేయర్ పదవిని తొలుత ఎవరికి కేటాయిస్తారన్న విషయమై సర్వత్త్రా చర్చానీయంశమైంది. బుధవారం సాయంత్రం కూడా ప్రకటించకపోతే మరింత ఉత్కంఠ పెరిగింది. గురువారం ఉదయం కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి మేయర్ అభ్యర్థితో పాటు డిప్యూటీ మేయరు పేర్లను ప్రకటిస్తారు. అక్కడి నుంచి నగరపాలక సంస్థకు ప్రదర్శనగా రానున్నారు. గురువారం కార్పొరేటర్ల ప్రమాణం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.
అదనపు డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన వచ్చాక ఎన్నుకుంటారు. డిప్యూటీ మేయర్లుగా మైనార్టీలు, మరో సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు జరిగిన తెనాలి, రేపల్లె, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ మున్సిపల్ పట్టణాల్లో గురువారం వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారణం, వైస్ ఛైర్మన్ల ఎంపిక పూర్తి చేస్తారు. ఇక్కడ కూడా అదనపు వైస్ ఛైర్మన్‌కు సంబంధించి ప్రకటన వచ్చిన తర్వాతే చేపడతారు. ఇందుకు సంబంధించిన పేర్లను వైకాపా జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు పంపారు. గురువారం ఉదయం ఆయా పట్టణాల్లో నేతలకు సమాచారం ఇస్తారు.
ఛైర్మన్ల పదవీకాలం, వైస్ ఛైర్మన్ల ఎంపిక తదితర అంశాల్లో కొన్ని చోట్ల నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో బుధవారం ప్రకటించలేదు. అదనంగా డిప్యూటీ మేయర్ పదవి, వైస్ ఛైర్మన్ల పదవులు రావడంతో సామాజిక వర్గాలు, ప్రాంతాలు, పార్టీకి సేవలు తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని పదవులు సర్దుబాటు చేస్తున్నారని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ముందస్తుగా అనుకున్నట్లు జాబితాలు సిద్ధమైన అదనంగా పదవులు రావడంతో సామాజిక వర్గాల్లో మార్పులు చేసి వీలైనంత మందికి అవకాశం ఇచ్చే దిశగా కసర్తత్తు జరుగుతోందన్నారు. గురువారం ఉదయం కౌన్సిళ్లు సమావేశమయ్యే సమాయానికి పదవుల పంపిణీపై స్పష్టత ఇచ్చి సమావేశాలకు పంపుతామన్నారు. అన్ని చోట్లా స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో ఎన్నిక లాంఛనమే కావడంతో మిగిలిన అంశాలపై దృష్టి సారించమన్నారు.
ఇదీ చదవండి: