రాజధాని గ్రామాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం 316 ఎకరాల కావాలని సీఆర్డీఏకు ప్రతిపాదనలు పంపినట్లు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రాజధాని పరిధిలో మొత్తం 26 వేల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన గుంటూరులో వెల్లడించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాలు రాజధానిలో భాగమేనన్నారు. దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని.. అధికారులు సర్వే చేస్తున్నారని చెప్పారు. మార్చి 25న లబ్ధిదారులకు కన్విన్స్ డీడ్ పత్రాలను అందజేస్తామన్నారు. వీటిని లబ్ధిదారులు బ్యాంక్లో తనఖా పెట్టుకోవచ్చని అన్నారు.
రైతులు, పేదల భూములను బలవంతంగా తీసుకున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని కలెక్టర్ వివరణ ఇచ్చారు. కొందరు రైతులు వారి భూమల ప్రక్కనున్న ప్రభుత్వ భూమిని కూడా అనధికారంగా సాగు చేస్తున్నట్లు గుర్తించి వాటినే స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధపడి వచ్చారని చెప్పారు. 30(ఏ) సెక్షన్ ప్రకారం భూ సేకరణకు రైతులు అంగీకరిస్తే 15 రోజుల్లో భూమిని తీసుకుని 6 రోజుల్లోనే నగదును వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇప్పటికే భూ సేకరణకు అంగీకరించిన రైతులకు 2 కోట్లను చెల్లించేందుకు ఆన్లైన్లో బిల్లులు అప్లోడ్ చేయగా 7 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వివరించారు.
ఇవీ చదవండి:
రాజధాని ప్రాంతంలో ఆగని మృత్యుఘోష... ఆవిరైన 29గ్రామాల ప్రజల ఆశలు