Paddy Procurement in AP : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. గోదారి జిల్లాల్లో హడావుడిగా కొనుగోలు కేంద్రాలను తెరిచిన అధికారులు ఆశించినంత మేర వడ్లను కొనుగోలు చేయట్లేదు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నిల్వ చేసుకునే స్థలం లేక రోడ్లకు ఇరువైపులా వడ్లు ఆరబెడుతూ ఎప్పుడు కొంటారా అంటూ కర్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం మారినా ధాన్యం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను అమ్ముకుని కష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకులో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పంటను విక్రయించేందుకు కేంద్రాలకు వెళ్లినా కొనుగోళ్లు సాగక తిరిగి వస్తున్నారు.
"ధాన్యం కొనడం లేదు. తేమ శాతం ఎక్కువ, ధాన్యం పచ్చిగా ఉందని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. మళ్లీ తిరిగి ఆరబెట్టాల్సి వస్తోంది. దీనికి తోడూ అధికారులు స్పందించడం లేదు. వాతావరణం బాగా లేదు. టార్ఫాలిన్లు లేకపోవడంతో బయటినుంచి తెచ్చి అద్దెకు తెచ్చుకొని ఆరబెడుతున్నాం. ఇప్పటికైనా త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం." - రైతులు
Paddy Procurement Problems in AP : పంటను నిల్వ చేసుకునేందుకు స్థలం లేక రోడ్ల పక్కన పోరంబోకు స్థలాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ ధాన్యపు రాశులను ఆరబెడుతున్నారు. వాస్తవానికి ఆరబెట్టిన ధాన్యానికే ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉన్నా ఎండబెట్టేందుకు చోటు లేకపోవడం మరోవైపు వాతావరణం దోబూచులాడటంతో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక రైతులకు కంటిమీద కునుకులేదు. కొందరు అన్నదాతలు ప్రైవేట్ స్థలాల్లో అద్దెలు చెల్లించి వడ్లు కాపాడుకుంటున్నారు.
అధికారుల నిర్వాకం రైతులకు మరో సమస్యగా మారింది. తేమ శాతం ఎక్కువగా ఉందని ధాన్యం పచ్చిగా ఉందంటూ ఇలా అనేక సాకులతో కొనుగోలు చేయడం లేదు. చేసేదేమీ లేక రైతులు దళారులకే అయినకాడికి అమ్ముకుంటున్నారు. రాయితీపై అందిస్తామన్న పరదాలు, గోనె సంచెలు సైతం అందుబాటులో లేవని అధిక మొత్తం చెల్లించి బయటే కొనుక్కోవాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెసులుబాటు కల్పించి ధాన్యం నీటిపాలు కాకముందే వేగంగా కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు: నాదెండ్ల మనోహర్