గుంటూరు జిల్లా తెనాలిలో ఆదాయపు పన్ను ఎగవేత కోసం నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ దుర్గా ప్రసాద్ అరెస్టయ్యారు. అతడి సమాచారం మేరకు విజయవాడలోని ఎంజీఎం జ్యూయెలర్స్ కు చెందిన... షాపు యజమానులు మహేష్, వెంకటేష్ తో పాటు న్యాయవాది వద్ద పని చేసే అశోక్ ని అరెస్టు చేశారు. వీరిని తెనాలి కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
బ్యాంకు మేనేజర్ దుర్గాప్రసాద్ సహకారంతో బంగారం దుకాణం వ్యాపారులు 40 నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఆధార్ నెంబర్లు సేకరించి.. ఖాతాలు తెరవడంలో బ్యాంకు అధికారులు సహకరించారు. ఇలా 40 నకిలీ ఖాతాల నుంచి 7.50 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
తెనాలికి చెందిన న్యాయవాది కోటేశ్వరరావు పేరిట నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపారు. 'మా వద్ద ఖాతా తెరిచినందుకు ధన్యవాదాలు' అని చెన్నై లోని బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి సంబంధిత న్యాయవాదికి లేఖ రావటంతో విస్తుపోయారు. వెంటనే తెనాలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి దుర్గాప్రసాద్ ని రెండు వారాల క్రితం అరెస్టు చేశారు. అలాగే నకిలీ బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలు జరిపింది ఎంజిఎం జ్యూవెలర్స్ యజమానులని గుర్తించారు. దీంతో వారిని అరెస్టు చేసి... తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. అలాగే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని అన్నారు.
ఇదీ చదవండీ...కడప 30వ ఎన్సీసీ బెటాలియన్ను సందర్శించిన డీడీజీ కృష్ణన్