రోడ్డు ప్రమాదం జరిగిన మెుదటి గంటలోగా చికిత్స అందజేస్తే.. ప్రాణాలు పోకుండా కాపాడవచ్చునని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో... కలెక్టరేట్లో గుడ్ సమరిటన్ లాపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన మెుదటి గంటను గోల్డెన్ అవర్ అంటారన్నారు. ఆ సమయంలో ప్రమాద బాధితులకు సరైన వైద్యం అందించాలన్నారు. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందించాలన్నారు. ఈ విధంగా ఆసుపత్రిలో చేర్చే వారికి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ చట్టం 2020 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వివరించారు. దీని ద్వారా ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా, నిస్వార్థంగా సహాయం అందజేయాలన్నారు. ఎటువంటి పోలీస్ కేసులు కూడా ఉండవని వివరించారు.

ఆసుపత్రుల నిర్వాహకులు రహదారి ప్రమాద బాధితులను ఎవరు తీసుకువచ్చినా చేర్చుకోవాలనీ.. తగిన వైద్య సేవలు అందజేయాలని కోరారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఓటేయలేదని మెట్లు కూల్చివేత... గుంటూరు జిల్లాలో ఘటన