గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. పొలం దారి విషయంలో వివాదం కాల్పులకు దారి తీసింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. రాయవరానికి చెందిన మట్టా సాంబశివరావు మాజీ సైనికుడు. సమీప బంధువులైన మట్టా బాలకృష్ణ, మట్టా శివాజీ కుటుంబంతో పొలం దారి విషయంలో కొన్నేళ్లుగా వివాదముంది. దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం పొలంవద్ద సాంబశివరావు, బాలకృష్ణకు మధ్య వివాదమేర్పడింది. సాయంత్రం ఆరింటి సమయంలో సాంబశివరావు తన ఇంటికి సమీపంలో ఉన్న బాలకృష్ణ ఇంటి వద్దకెళ్లి అక్కడా గొడవపడ్డారు.
ఈ క్రమంలోనే సాంబశివరావు తనవద్ద ఉన్న పిస్టల్‌తో బాలకృష్ణ, శివాజీలపై కాల్పులు జరిపాడు. వివాదాన్ని వారించేందుకు వెళ్లిన మట్టా వీరాంజనేయులుపైనా కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్లకుపైగా కాల్చాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శివాజీ, బాలకృష్ణను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు. కాల్పులు జరపకముందు కొద్దిసేపు ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. అనంతరం సాంబశివరావు తన లైసెన్సుడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో శివాజీ, బాలకృష్ణ, వీరాంజనేయులు శరీర భాగాల్లోకి తూటాలు వెళ్లడమే కాకుండా ఘటన జరిగిన ప్రాథమిక పాఠశాలవద్ద బుల్లెట్లు పడ్డాయి. కాల్పుల ఘటనతో అక్కడున్న వారు పరుగులు తీశారు. వివాదానికి కారణాలపై గురజాల డీఎస్పీ మెహర్‌ప్రసాద్ విచారణ జరిపారు. నిందితుడు సాంబశివరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:
NATIONAL SEMINAR: 'రైతుల సమస్యల పరిష్కారానికి.. వాళ్లతోనే కమిటీ వేయాలి'