రాష్ట్రవ్యాప్తంగా ఆరుద్ర నక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవాన్ని జరిపించారు. వేకువజాము నుంచే స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరద్వారం ద్వారా స్వామి, అమ్మవార్లు నేడు దర్శనమిచ్చారు. అనంతరం నందివాహనంపై స్వామి, అమ్మవార్లకు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
ఉత్తరద్వార దర్శనం..
ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల శివాలయంలో ఆరుద్రోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీగంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగేశ్వరస్వామి వారి దేవాలయంలో స్వామివారి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచే శివయ్యకు అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి నగరోత్సవం వైభవంగా జరిగింది. పెద్దఎత్తున భక్తులు హాజరై శివయ్యను దర్శించుకున్నారు.
త్రికోటేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం
గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఆరుద్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయాధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఆరుద్రోత్సవ వేడుకల్లో శ్రీ మేధాదక్షిణామూర్తి దీక్ష మాలను ధరించిన స్వాములు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఆలయంలో మాల విరమణ చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో విశేష కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి జ్యోతిదర్శనం నిర్వహించారు. అనంతరం లింగోద్భావకాలంలో త్రికోటేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం చేశారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, విభూధి, గంధం, కుంకుమ, తైలం, పంచదార, సుగంధద్రవ్యాలతో పాటుగా త్రికోటేశ్వరునికి అన్నాభిషేకం నిర్వహించారు.
విజయవాడ శ్రీదుర్గా నాగేశ్వర స్వామి క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు ఘనంగా జరిపించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి గణపతి పూజ ఆవుపాలు, పంచామృతాలు, పూలతో స్వామివారికి అభిషేకం చేశారు. శ్రీదుర్గా, పార్వతీ అమ్మవార్లకు కుంకుమ పూజ, శ్రీ చక్రార్చనలు, స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకంగా సోమవారం కూడా కావడంతో వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చూడండి: liquor cost decrease: మందు బాబులు ఖుష్.. మద్యం దుకాణం ముందు పూజలు