ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. గత 5 నెలలుగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు వేతనాలు లేకపోవటంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. కరోనా సమయంలో 20 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు గుండెపోటుతో మరణించారని ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడించారు.