గుంటూరు నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ 600 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. వాటిలో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే. నగరంలో వివిధ రకాల ప్రకటనల బోర్డులు 3వేల వరకూ ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రైవేటు భవనాలపై... మరికొన్ని ప్రభుత్వ స్థలాల్లోనే ఏర్పాటు చేశారు. 2010-11లో నిర్ధారించిన ధరల ప్రకారం ప్రకటన బోర్డుల ఏర్పాటుకు పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి పన్నులు కచ్చితంగా వసూలు చేసే అధికారులు.. యాడ్ ఏజెన్సీల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నిబంధనల ప్రకారం డబ్బులు వసూలు చేస్తే నగరపాలక సంస్థకు ఏటా 10కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుంది. కానీ ప్రస్తుతం సగం కూడా రావటం లేదు. అనధికారికంగా బోర్డులు ఏర్పాటు చేయటమే ఇందుకు.. అసలు కారణం. మరికొందరైతే నిబంధనలు పట్టించుకోకుండా బోర్డులు పెడుతున్నారు. ప్రజా భద్రత దృష్ట్యా.. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు పెట్టకూడదు. అలాగే వాటి నిర్మాణం, ఏర్పాటు చేసే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. హోర్డింగ్ ఏర్పాటు తర్వాత ఇంజినీరింగ్ అధికారులు వాటిని పరిశీలించాలి. అలాగే కార్పొరేషన్ కు చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా వసూలు చేయాలి. కానీ ఇవేవీ సక్రమంగా జరగటం లేదు. ఇటీవలి రహదారి మధ్యలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఇవి వాహనదారుల దృష్టి మరల్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హోర్డింగ్ లు పెట్టుకోవాలన్నా, ఫ్లెక్సీలు వేసుకోవాలన్న నగర పాలక సంస్థ టెండర్లు నిర్వహించాలి. కానీ ఈ ప్రక్రియ సరిగ్గా జరగని పరిస్థితి. టెండర్లతో పనిలేకండా కొందరు ప్రభుత్వ పెద్దల అండతో ప్రకటన బోర్డులు పెట్టారు. కొన్ని యాడ్ ఏజెన్సీలపై ఫిర్యాదులు రాగా.. ఆయా సంస్థలకు కేవలం డిమాండ్ నోటీసు పంపిన అధికారులు.... చేతులు దులిపేసుకున్నారు. సదరు ఏజెన్సీలు బకాయిలు చెల్లించకపోయినా ప్రకటనల బోర్డులు తొలగించే సాహసం చేయలేదు.
ఇదీ చదవండి: