వైకాపా మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతిస్తున్నాయని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న బహిరంగ సభాస్థలిని ఆయన పరిశీలించారు. గుంటూరు జిల్లా రాయపూడిలో నిర్వహిస్తున్న ఈ సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరవుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అమరావతిలోనే రాజధాని ఉండాలని ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు. నిన్నటి వరకు భాజపా నేతలు తలో మాట మాట్లాడినా... ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధానిలో పర్యటించి ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పారన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం దిల్లీ వెళ్లి మూడు రాజధానులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పటం సరికాదన్నారు. ఏడాదిగా ఉద్యమం జరుగుతున్నా జగన్ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా అమరావతిని రాజధానిగా ప్రకటించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. రేపటి బహిరంగ సభకు అన్ని అనుమతులు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు.
ఇదీ చదవండి : అమరావతి: రేపు 'జనరణభేరి' భారీ బహిరంగ సభ