కృష్ణానది వరద ఉద్ధృతి కారణంగా గుంటూరు జిల్లా రైతులకు తీవ్రనష్టం ఏర్పడింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజి నుంచి 6 లక్షలు క్యూసెక్కులు దాటి వరద ప్రవహించడంతో అమరావతి, తుళ్లూరు, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర మండలాల్లో పసుపు, అరటి, కంద, మినుము పంటలు దెబ్బతిన్నాయి. వరద ధాటికి చాలాప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ఉద్యాన శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 6వేల ఎకరాల్లో వరి, పత్తి వంటి వ్యవసాయపంటలు, 3,830 ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 1012 ఎకరాల్లో పసుపుపంట, 982 ఎకరాల్లో అరటి, 463 ఎకరాల్లో కంద, 255 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతినగా.. 292 ఎకరాల్లో కూరగాయలు, 122 ఎకరాల్లో పూలతోటలు దెబ్బతిన్నాయి.
కృష్ణా వరద ప్రవాహ తాకిడితో డెల్టా పరిధిలోని రైతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి అందాల్సిన పంట నిలువెత్తు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లిపర మండలంలోని అత్తలూరివారి పాలెంలో రేపల్లి కాలువపై షట్టర్ ఏర్పాటు చేయడం ద్వారా వరద ముంపు నుంచి తమను కాపాడాలని రైతులు వేడుకున్నారు.
పంటలు రెండ్రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో రైతులు విలవిలల్లాడుతున్నారు. మూడు రోజులు దాటితే పంట కుళ్లిపోయే ప్రమాదమున్నందున వరద ప్రవాహం తగ్గిపోవాలని రైతులు మొక్కుతున్నారు. ఎక్కువమంది కౌలు, అసైన్డు రైతులే. ఎకరాకు ఏడాదికి 40వేలు కౌలు చెల్లిస్తూ.. అప్పులు చేసి సాగుచేస్తుండగా.. వరదలు వారి ఆశల్ని అడియాసలు చేశాయి. గత ఏడాది ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నామని.. నష్టపోయిన తమకు ఇంతవరకు పైసా చేతికి రాలేదని వాపోతున్నారు. వరదలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రధానంగా ప్రకాశం బ్యారేజి దిగువన పశ్చిమ డెల్టా ప్రాంతం.. లక్షలాది క్యూసెక్కుల వరద తాకిడితో ఒత్తిడి పెరిగింది. లంక గ్రామాల్లోకి వెళ్లడానికి దారులు మూసుకుపోయాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ లంకగ్రామాల్లో పడవపై పర్యటించి బాధితులను ఓదార్చారు. వరద ఉద్ధృతి దృష్ట్యా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి సహాయ, పునారావాస కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నది పరివాహక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా నది వరద ప్రవాహం హెచ్చుతగ్గులు కొనసాగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: