ఎగువన కురిసిన వర్షాలకు ఏటా కృష్ణాతీర వాసులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. లక్షలాది క్యూసెక్కుల వరద నీటిని కడలికి మళ్లించటంలో దిగువన ఉన్న దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని వందలాది గృహాలు ముంపునకు గురవుతున్నాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ తరుణంలో ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 5.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటం వల్ల చిట్టచివరనున్న రేపల్లె మండలం పెనుమూడి పల్లెపాలెం గృహాలు సైతం నీట మునుగుతున్నాయి.
ఎగువన ఉన్న భట్టిప్రోలు పల్లెపాలెం, పెదలంక, పెసర్లంక, చింతమోటు, రావిలంక, పోతార్లంక, గాజల్లంక, ఆవులపాలెం, సుగ్గుల్లంక, ఈపూరులంక తదితర లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయం. 2009 అక్టోబరులో వచ్చిన వరదకు వందల గృహాలు పూర్తిగా దెబ్బతినటం వల్ల కూడదీసుకున్న సొమ్ముతో ఇళ్లు నిర్మించుకున్నారు. 2019లో సంభవించిన వరదలకు నాలుగు వేల గృహాలు మరోసారి నీట మునిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో వరదకు వందలాది గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇరవై రోజులు తిరక్కుండానే కృష్ణమ్మ మరోసారి ఉగ్రరూపం దాల్చింది.
నీటిలో కొట్టుకుపోయిన హామీలు
2009, అక్టోబరులో సంభవించిన వరదలకు జిల్లాలో 20,630 గృహాలు నీట మునిగాయి. 1244 పూర్తిగా 2735 పూర్తిగా దెబ్బతిన్నాయని అప్పటి ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. వరద పోటు ఉన్నవారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటిలో కొట్టుకుపోయాయి. తరువాత పలు పర్యాయాలు వరదలు భయపెట్టాయి. 2018, 2019 సెప్టెంబరులో వచ్చిన వరదలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వచ్చిన వరదలు 2009ను తలపిస్తున్నాయి. అప్పటినుంచి భయాందోళనలో గడుపుతున్న పెనుమూడి పల్లెపాలెంకు చెందిన 120 కుటుంబాలకు రూపాయి పరిహారం దక్కలేదు. గృహాలూ సమకూరలేదు.
అధికారులు మొహం చాటేస్తున్నారు
సమకూర్చుకున్న సంపద ఉంటుందో నీటి పాలవుతుందో తెలియటం లేదు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుందనగానే అధికారులు హడావుడిగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోకుండా మొహం చాటేస్తున్నారు. -ఏకనూరు మల్లేశ్వరి
సర్వస్వం కోల్పోయాం
వరదల కారణంగా సర్వస్వం కోల్పోయాం. కృష్ణమ్మ విలయతాండవంలో గూడు మునిగింది. సంపాదించిన కొద్దోగొప్పో సంపద వరద పాలైంది. 20 రోజులనాడు నీట మునగటంతో మరమ్మతుల పనిలో ఉండగానే మళ్లీ వరద విరుచుకుపడింది. ఇళ్లు కట్టుకోవాలంటే కనీసం రూ.50 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకుంటేనే గూడు ఏర్పడుతుంది. -మోకా లక్ష్మి, పెనుమూడి పల్లెపాలెం
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
వరద బారిన పడిన పలు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం. ఆహారం, తాగునీరు, ఉండేందుకు సదుపాయం కల్పించాం. ప్రస్తుతం పెదకొండూరు, రావిలంక, పెనుమూడి పల్లెపాలెం ముంపునకు గురయ్యాయి. వరద ప్రవాహం తగ్గగానే జరిగిన నష్టం అంచనా వేసి ప్రభుతం దృష్టికి తీసుకెళ్తాం. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. -కె.మయూర్‌అశోక్, సబ్ కలెక్టర్, తెనాలి
జలదిగ్బంధంలో పల్లెపాలెం
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడం వల్ల చాలా ప్రాంతాలు జలదిగ్బంధ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇదీ.
- పునరావాస కేంద్రాలకు తరలిన వారు 350
- బాధిత కుటుంబాలు 550
- వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలు 20
- నీట మునిగిన గృహాలు 540
ఇదీ చూడండి:
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద