Aluminum Air Battery Vehicles: బ్యాటరీ రీఛార్జి చేసేందుకు కరెంటుతో పని లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బ్యాటరీతో పోలిస్తే మైలేజీ అధికం. భద్రతకు ఢోకాలేదు. కాలుష్యం ముప్పులేదు. వంట గ్యాస్ సిలిండర్‌లా మార్చుకోవచ్చు. తయారీ వనరులను దిగుమతి చేసుకోవాల్సిన పనే లేదు. దేశీయంగా పుష్కలంగా లభ్యమయ్యే అల్యూమినియమే అస్త్రం అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పరిశోధన విభాగం డైరెక్టర్, కంపెనీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రామకుమార్ వెల్లడించారు. ఆ బ్యాటరీల అందుబాటులోకి వస్తే వాహన రంగంలో ఎలాంటి మార్పులొస్తాయో వివరించారు.
అల్యూమినియం బ్యాటరీ రీఛార్జి ఎలా?
ఈ బ్యాటరీకి విద్యుత్తే అవసరం లేదు. రీఛార్జి చేయాల్సిన పనేలేదు. అది పేలుతుందేమోనన్న భయమూ అక్కర్లేదు. ఛార్జింగ్ తగ్గినప్పుడు పెట్రోలు బంకులు లేదా అవుట్‌లెట్లలో బ్యాటరీ ఇచ్చి మరోదానిని నిముషాల్లో మార్చుకోవచ్చు. వంట గ్యాస్ సిలిండరు ఇచ్చి మరోటి తీసుకుంటున్నట్లు ఇదీ అంతే. కొనుగోలు చేసినప్పుడు బ్యాటరీ లేకుండా కార్లను కంపెనీలు ఇస్తాయి. వంట గ్యాస్ సిలిండరుకు డిపాజిట్ చెల్లించినట్లు బ్యాటరీ కోసం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ ఎంత? మార్చుకున్నప్పుడు ఎంత చెల్లించాలి? అన్నది ఖరారు కాలేదు. లిథియం బ్యాటరీ వ్యయంతో పోలిస్తే వాహన నిర్వహణ వ్యయం 50 శాతం తగ్గుతుంది.
అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ వాహనాలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయి?
2024 చివరికల్లా దేశంలో తొలిదశ బ్యాటరీలు అందుబాటులోకి వస్తాయి. అప్పటికి వాహనాలూ వచ్చే అవకాశం మెండుగా ఉంది.
ఈ బ్యాటరీతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు?
పరిశోధనలు తుది దశలో ఉన్నాయి. ఇటీవల మూడు చక్రాల వాహనానికి అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని అమర్చి నడిపితే 450 కిలోమీటర్లు ప్రయాణించింది. అదే వాహనాన్ని లిథియం బ్యాటరీతో నడిపితే 80 నుంచి 100 కిలోమీటర్లే వచ్చింది.
దేశంలోని ఏయే వాహన తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు?
ఈ బ్యాటరీతో నడిచే వాహనాలు తయారు చేసేందుకు మారుతీ, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా మోటార్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. టాటా మోటార్స్ కారుకు అల్యూమినియం బ్యాటరీని అమరిస్తే 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలిగిన సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించాం. మారుతీ, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలు కూడా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించటంలో మా ముద్ర వేయటమే లక్ష్యం.
అల్యూమినియంతో బ్యాటరీని తయారుచేయొచ్చని ఎలా గుర్తించారు?
దిగుమతులపై ఆధారపడని సహజ వనరులతో బ్యాటరీని తయారు చేయటంపై చేసిన అధ్యయనంలో అల్యూమినియమే కీలకమని గుర్తించాం. ఆ నిక్షేపాలు పుష్కలంగా ఉండటమూ కలిసొచ్చే అంశం. ప్రభుత్వానికి చెబితే సానుకూలంగా స్పందించింది. అల్యూమినియంపై ప్రపంచంలో ఎక్కడైనా పరిశోధనలు జరుగుతున్నాయా అని అన్వేషించాం. బార్ ఇలాన్ విశ్వవిద్యాలయం (ఇజ్రాయెల్)ఈ పరిశోధన చేసినట్లు గుర్తించాం.
ఫినర్జీ కంపెనీతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారు?
బార్ ఇలాన్ విశ్వవిద్యాలయాన్ని సంప్రదిస్తే పేటెంటుతోపాటు పరిశోధననూ ఫినర్జీ (ఇజ్రాయెల్) అనే అంకుర సంస్థకు విక్రయించినట్లు చెప్పటంతో ఆ కంపెనీని సంప్రదించి భారతదేశంలో ఆ సాంకేతికతతో బ్యాటరీల తయారీకి ఒప్పందం చేసుకున్నాం. 50:50 నిష్పత్తిలో ఏర్పాటైన సంయుక్త ఒప్పందం ఇది. తొలిదశలో భారత్ మార్కెట్‌లో విక్రయిస్తాం. ఎగుమతులూ చేస్తాం.
ప్రస్తుతానికి వచ్చిన 500 కిలోమీటర్లే గరిష్ఠమా?
లిథియంలో శక్తి సాంద్రత (ఎనర్జీ డెన్సిటీ) కిలోకు నాలుగు కిలోవాట్లుంటే, అల్యూమియంలో ఎనిమిది కిలోవాట్లు ఉంది. ప్రస్తుతం 4 కిలోవాట్ల సాంద్రతనే వెలికి తీస్తున్నాం. ఈ సాంద్రతను మరింతగా మెరుగుపరచటానికి మా శాస్త్రవేత్తలు ఫినర్జీతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ సాంద్రత పెరిగిన కొద్దీ మైలేజీ పెరుగుతుంది. సాంద్రత 6 నుంచి 7 కిలోవాట్లకు పెరిగితే మైలేజీ 800 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది.
విద్యుత్ కార్లంటే గుర్తొచ్చేది టెస్లా కదా! ఆ కంపెనీ ఈ సాంకేతికతను ఎందుకు అందిపుచ్చుకోలేదు?
మనకన్నా ముందే టెస్లా అల్యూమినియం సాంకేతికతను గుర్తించింది. అప్పటికి ఆ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలు అంత సంతృప్తికరంగా లేకపోవటంతో వారు వెనకడుగు వేశారు. ఆ తర్వాత అంకుర సంస్థ చేసిన పరిశోధనలు సత్ఫలితాన్ని ఇవ్వటంతో ఐఓసీ ఒప్పందం చేసుకుంది.
అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో వాహనదారులకు ఎలాంటి అదనపు ప్రయోజనం?
వాహనదారులకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ అల్యూమినియం బ్యాటరీ అత్యంత కీలక భూమికను పోషిస్తుంది. దేశంలో అల్యూమినియం నిక్షేపాలు అపారం. ఈ బ్యాటరీని వాహనాల్లో ఉపయోగించే క్రమంలో అది రూపాంతరం చెంది యాక్టివ్ అల్యూమినియం ట్రైయాక్సైడ్‌గా మారుతుంది. దాన్నుంచి అల్యూమినియాన్ని మళ్లీ తయారు చేయవచ్చు. ఈ పునరుత్పత్తి కోసం హిండాల్కోతో ఒప్పందం కుదుర్చుకున్నాం. లిథియం బ్యాటరీతో అయ్యే వ్యయంలో కనీసం 50 శాతం తక్కువకే అల్యూమినియం బ్యాటరీని వినియోగించుకోవచ్చు.
అల్యూమినియం బ్యాటరీ ఎలా ఆవిషృతమైంది?
ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయ ప్రాథమిక పరిశోధనకు.. అదే దేశానికి చెందిన అంకుర సంస్థ ఫినర్జీ పదును పెట్టగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరింత సానపట్టి ఆవిష్కరించిందే అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ. వాహన రంగంలో ఇదో విప్లవం. అంతే కాదు.. వాహనదారుడికి నిర్వహణ వ్యయం సగానికిపైగా తగ్గుతుంది. పరిశోధనలు మరింత కొలిక్కివస్తే మైలేజీ ఇంకా పెరుగుతుంది. 2024 చివరికల్లా ఈ బ్యాటరీలు అందుబాట్లోకి వస్తాయి.
ఎవరీ రామకుమార్?
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన రామకుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) చదివారు. ఐఐటీ, రూర్కీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. మూడు దశాబ్దాలకు పైగా అనేక పరిశోధనల్లో పాలుపంచుకుంటున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన రాసిన 150కి పైగా పరిశోధనపత్రాలు ప్రచురితమయ్యాయి. వ్యక్తిగతంగా 55 పేటెంట్లు పొందారు. ఆయన హయాంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెయ్యికి పైగా పేటెంట్లు సాధించింది.ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన ఆయన దేశ విదేశాల్లోని అనేక సంస్థల్లో బోర్డు సభ్యునిగా, సలహాదారుగా ఉన్నారు.
ఇవీ చదవండి: