రాజధాని ప్రాంతంలో అరెస్టైన రైతులు, మహిళలను గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అమరావతి రాజకీయ ఐకాస తరఫున తెదేపా, జనసేన నేతలు స్టేషన్కు వచ్చి మహిళలు, రైతులకు బెయిల్ ఇచ్చారు. ఈ సమయంలో నల్లపాడు పోలీసు స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసు స్టేషన్కు వచ్చిన.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. 144 సెక్షన్ విధించినట్లు కనీసం ఉత్తర్వులు కూడా చూపించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారులు చెబితే రైతులు, మహిళలను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. బ్రిటిష్ చట్టాలను స్వతంత్ర భారతదేశంలో అమలు చేస్తారా అని నిలదీశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా 144 సెక్షన్ లేదన్న ఆయన... ఈ ఘటనలపై పార్లమెంటులో మాట్లాడతానని గల్లా స్పష్టం చేశారు.
ప్రశ్నించినందుకే అక్రమ కేసులు
అక్రమ అరెస్టులపై ఎస్పీని ప్రశ్నించినందుకే తనను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. కానిస్టేబుల్ను దూషించానని తప్పుడు కేసులు పెట్టారన్నారు. పాలకులు తమ గోడు పట్టించుకోలేదని.. దుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తోన్న మహిళలను అరెస్టు చేశారని విమర్శించారు. అమరావతి నుంచే సీఎం జగన్ పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: