కరోనా బాధితురాలైన బాలింత ఒకరు గురువారం తన శిశువుకు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వైద్యులు, సిబ్బంది స్పందించడం లేదని ఏకంగా కొవిడ్ వార్డు నుంచి నడుచుకుంటూ సూపరింటెండెంట్ ఛాంబర్ దాకా వచ్చింది. అనంతరం యంత్రాంగం నిర్లక్ష్యంపై సెల్ఫీ వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా ఆసుపత్రి సెక్యూరిటీ, వార్డులో ఉండే నర్సులకు పట్టలేదు.
తెనాలికి చెందిన వెంకాయమ్మ తన భర్త కరోనాతో ఆసుపత్రిలో చేరారని అతని ఆచూకీ, ఆరోగ్య పరిస్థితి తెలియటం లేదని ఆసుపత్రి ఉన్నతాధికారులను కలిసి వేడుకున్నా సమాచారం లభ్యం కాలేదు. ఆసుపత్రిలో రికార్డుల నిర్వహణ లేమిని ఈ ఉదంతం కళ్లకు కడుతోంది.
రికార్డుల నిర్వహణేదీ?
అసలు ఆసుపత్రికి రోజుకు ఎంతమంది కొవిడ్ బాధితులు వస్తున్నారు? ఎంతమంది నాన్ కొవిడ్ వైద్యసేవలు పొందుతున్నారు? ఎమ్మెల్సీ కేసులెన్ని వస్తున్నాయి.. దిక్కుమొక్కు లేకుండా వైద్యం పొందుతున్న వారెందరు? మార్చురీలో ఎన్ని శవాలు ఉన్నాయి? వాటిల్లో కొవిడ్‌వి ఎన్ని? నాన్ కొవిడ్‌వి ఎన్ని? ఎమ్మెల్సీ బాడీలు.. గుర్తు తెలియని శవాలెన్ని? చనిపోయినవారికి కరోనా నిర్ధారణకు ఎప్పుడు స్వాబ్‌లు తీసి పరీక్షలకు పంపారు? వారిలో ఎందరికి నిర్ధారణ అయింది. వారికి సంబంధించిన శవాలు ఎన్నింటికి అంత్యక్రియలు పూర్తయ్యాయి? ఇంకెన్ని మిగిలి ఉన్నాయో సమస్త సమాచారం పక్కాగా ఉండి ఉంటే ఇటీవల ఆసుపత్రిలో తెనాలికి చెందిన వెంకాయమ్మ తన భర్త వివరాల గురించి అడగ్గానే సమాధానం చెబితే ఆమె ఆసుపత్రి తీరుపై హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేదా? అని ఆసుపత్రి వర్గాలు ప్రశ్నించుకోవాలి. ఆసుపత్రి పరిపాలనలో సూపరింటెండెంట్‌కు సహాయకుడిగా వ్యవహరించేందుకు మూడేళ్ల కిందట రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులకు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ ఒకరిని అప్పటి ప్రభుత్వం నియామకం చేసింది. వీరు ప్రతి రోజు వార్డులు కలియతిరిగి ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంది? పేషెంట్ కేర్ ఎలా ఉంది? సెక్యూరిటీ వ్యవస్థ పనితీరును గమనిస్తూ సూపరింటెండెంట్‌కు తెలియజేస్తూ ఉంటే ఆసుపత్రి పాలన సజావుగా సాగుతోంది. గుంటూరు జీజీహెచ్‌లో ఇది లోపించదనటానికి పై రెండు ఉదంతాలే నిదర్శనం.
రోగుల విభజన ఎలా..?
వైద్యసేవలు కోరుతూ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను మూడు విభాగాలుగా విభజించి(సెగ్రిగేషన్) వారిని అడ్మిషన్ల కోసం వేర్వేరుగా క్యూలో నిలబెడితే రోగులకు సులువుగా ఆసుపత్రిలో ప్రవేశం దొరుకుతుంది. ఆపై సత్వర వైద్యసేవలకు నోచుకుంటారు. కానీ ఆసుపత్రి గుమ్మంతొక్కే రోగులంతా తొలుత అడ్మిషన్ కోసం ఒకే క్యూలో నిలబడి అడ్మిషన్ పొందాల్సిన దుస్థితి. కొవిడ్ పేషెంట్లు, అనుమానిత లక్షణాలు కలిగిన వారు, సాధారణ పేషెంట్లు ఇలా అంతా ఒకే క్యూలో నిలబడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో వైరస్ వ్యాప్తి బాగా జరగటానికి ఆస్కారం ఉంది. ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే సెక్యూరిటీ వ్యవస్థను అప్రమత్తం చేసి ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో పేషెంట్లకు ఉన్న రోగం ఏమిటో ప్రాథమికంగా తెలుసుకుని సెగ్రిగేషన్ చేసి పంపితే వేర్వేరుగా రోగులు క్యూలో నిల్చొంటారు. ఇలా చేయటం ద్వారా అక్కడ కరోనా వ్యాప్తి అవకాశం ఉండదు. నిత్యం కొవిడ్ విభాగం వద్ద గంటకు ఒకసారి శానిటైజ్ చేసి వైరస్ నివారణ చర్యలు చేపట్టాలి. కానీ ఆసుపత్రిలో ఏ మూలన చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పటికైనా ఈ సమస్యలను అధిగమించటానికి అడ్మినిస్ట్రేటర్ వ్యవస్థను పక్కాగా పనిచేయించుకునేలా సూపరింటెండెంట్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.
ఇదీచదవండి