ఇళ్ల స్థలాల పేరిట వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రూ. 6,500 కోట్లు దోపిడీ చేసిందని.. మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట తెదేపా పార్లమెంటరీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. టిడ్కో గృహాల నిర్మాణాల్లోనూ రూ. 4,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ.. గుంటూరు జిల్లా వినుకొండలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటుగా విమర్శించారు. వేల కోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరపాలని తెదేపా గతంలో డిమాండ్ చేస్తే.. తమ అవినీతి బయటపడుతుందని ప్రభుత్వం భయపడిందన్నారు. మద్యం ధరలు పెంచి రూ. 5 వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులతో పాటు అనుబంధ రంగాలకు చెందిన శ్రామికుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి.. రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు.
దోపిడీ కోసం తీసుకొచ్చిన పథకం..
ఇల్లు ఉన్న వారికీ, వైకాపా అనుకూల వ్యక్తులకే పట్టాలు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నిజమైన పేదలకు తీరని అన్యాయం చేశారని ఆంజనేయులు విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనేది.. వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా అభివర్ణించారు. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను.. వైకాపా ప్రభుత్వం లాక్కొని వారిని వీధి పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు, దళితుల భూములను గుంజుకున్నారన్నారు.
చర్చకు సిద్ధమా...?
శావల్యాపురం మండలంలోని వేల్పూరు, కనమర్లపూడిలో చెరువులు, గుంటలు, గుట్టలు వద్ద వర్షం వస్తే మునిగిపోయే ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అర్హులైన నిరుపేదలు నివేశన స్థలాల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటే.. వారిని వదిలేసి ఇందిరమ్మ, ఎన్టీఆర్ గృహాలు ఉన్నవారికే పట్టాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. తమ ఆరోపణలను పూర్తి వివరాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని.. అధికారులు, పాలకులు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
స్థానిక ఎన్నికలంటే వైకాపాకు భయం..
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓటమి తప్పదని వైకాపా నేతలు భయపడుతున్నారని ఆంజనేయులు విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. ఏపీలో కరోనాను అడ్డం పెట్టుకుని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: