Electricity Reforms for Loan Incentives: అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడింది. ఇప్పటికే విద్యుత్తు సంస్కరణల బాట పట్టగా.. ఇప్పుడు ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు షాక్ ఇవ్వబోతోంది. కేంద్రం ప్రకటించిన సంస్కరణల అమలుకు ఇప్పటికే అడుగులు వేస్తున్న రాష్ట్రం.. కేంద్రం విధిస్తున్న తాజా షరతులను తప్పక పాటించాల్సిన పరిస్థితి. ఇకపై వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదు. రైతులు ఎంత విద్యుత్ వాడుతున్నారో.. ప్రభుత్వం బిగిస్తున్న స్మార్ట్ మీటర్ల ద్వారా లెక్కిస్తారు. ఆ మేరకు ముందుగా రైతులు బిల్లు చెల్లిస్తే.. తర్వాత రాష్ట్రప్రభుత్వం తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రైతులతోపాటు కొన్ని వర్గాలకు కొన్ని యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌కు సైతం ఇదే విధానం అవలంభించనున్నారు. కేంద్రం విధిస్తున్న ఈ షరతులకు రాష్ట్రం ఆమోదం తెలియజేస్తున్న క్రమంలో.. ఇకపై ప్రతిఒక్కరూ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. ముందే కరెంట్ బిల్లులు చెల్లించాలంటే.. అది రైతుకు అదనపు భారం అవుతుందని, పైగా ప్రభుత్వం తిరిగి డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని ఎదురుచూడాలని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే.. రాష్ట్రాలకు లక్షా 43వేల 332 కోట్ల అదనపు అప్పులకు అనుమతి ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. సంస్కరణల అమలు తీరును బట్టి ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో.. 0.25 నుంచి 0.5 శాతం వరకు అదనపు అప్పులకు అనుమతులు ఇస్తామని తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రానికి మరో 7వేల కోట్లకు పైగా రుణం లభించే అవకాశం ఉంది. విద్యుత్తు సంస్కరణలకు అనుసంధానంగా అదనపు అప్పులు ఇచ్చే విధానాన్ని కేంద్రం ఇంతకు ముందు కూడా అమలు చేసింది. ఆ మేరకు విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రం గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో అదనంగా 9వేల 574 కోట్ల అప్పు పొందిందని కేంద్రం వెల్లడించింది. ఏపీతోపాటు మరో 12 రాష్ట్రాలు 66వేల 413 కోట్ల మేర అదనపు రుణాలు పొందినట్లు వివరించింది.
CPI Rama Krishna on Current Charges: 'విద్యుత్ చార్జీలతో సామాన్యుడిపై భారం'
కేంద్రం చెబుతున్నట్లు అదనపు రుణం పొందాలంటే రాష్ట్రాలు కొత్తగా మరికొన్ని సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. విద్యుత్తు రంగంలో ఆర్థిక అంశాలన్నీ పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు విద్యుత్‌కు ఎంత సబ్సిడీ భరిస్తున్నాయి, డిస్కంలకు ఎంత మొత్తం బాకీ పడ్డాయనేది స్పష్టంగా వెల్లడించాలి. విద్యుత్తు పంపిణీ సంస్థల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగం సహా మొత్తం ఎంత విద్యుత్తు ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో మీటర్లు ఏర్పాటు చేసి, స్పష్టంగా లెక్కలు తేల్చాలి. మొత్తం విద్యుత్తు వినియోగంలో ఎంత శాతానికి మీటర్ల వ్యవస్థ ఏర్పాటయిందో కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. సాంకేతిక, వాణిజ్య విద్యుత్తు నష్టాలను తగ్గించగలగాలి. విద్యుత్తు సరఫరాకు, వస్తున్న ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని, ఒకే లబ్ధిదారు విద్యుత్తు రంగంలో రెండు రకాలుగా సబ్సిడీ పొందకుండా చూడాలని షరతులు విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రీపెయిడ్ విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సూచించింది. ఇవన్నీ అమలు చేస్తేనే అదనపు రుణం పొందేందుకు కేంద్రం అంగీకారం తెలుపుతుంది. అప్పుకోసం ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్రప్రభుత్వం వీటిని యథాతథంగా అమలు చేసేందుకు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
CPM Vidyut Porubata Padayatra: సామాన్యులపై విద్యుత్ భారం.. తొలగించాలని సీపీఎం పోరుబాట