POWER CONSUMPTION INCREASING : రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతల వేడి నుంచి ఉపశమనం పొందటానికి, చల్లదనాన్ని పొందటానికి కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు చేరటంతో విద్యుత్ గరిష్ఠ వినియోగం 230 మిలియన్ యూనిట్లకు చేరినట్టు ఏపీ ట్రాన్స్‌కో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ రెండు నెలల్లో ఎక్కువగా పెరిగే అవకాశం: గృహ, వాణిజ్య అవసరాలతో పాటు పరిశ్రమలు వినియోగిస్తున్న విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 11,960 మెగావాట్లకు చేరినట్టు ఏపీ ట్రాన్స్‌కో వెల్లడించింది. ఫిబ్రవరి ఆరంభంలో రాష్ట్రంలో 207 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయితే.. ప్రస్తుతం గరిష్ఠంగా 230 మిలియన్ యూనిట్లకు చేరినట్టు విద్యుత్ శాఖ స్పష్టం చేస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ వినియోగం 250 మిలియన్ యూనిట్ల వరకూ చేరే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఏపీ జెన్కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు 90 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
బహిరంగ మార్కెట్ నుంచి 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు: ఇక జెన్కో జల విద్యుత్ కేంద్రాల నుంచి గరిష్ఠంగా 12 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తంగా ఏపీ జెన్కో నుంచి 104 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇక ప్రస్తుతం బహిరంగ మార్కెట్ నుంచి 40 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ముందస్తు విద్యుత్ ఒప్పందాల మేరకు 90 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది.
ముందస్తు విద్యుత్ కోసం తాత్కాలిక ఒప్పందాలు: ప్రస్తుతం సగటు విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్‌లో 11,600 మెగా వాట్లకు చేరిపోవటంతో వచ్చే రెండు నెలల్లో విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ యూనిట్లను మించిపోతుందని ఏపీ ట్రాన్స్‌కో అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగానే ఎక్స్చేంజిలో ముందస్తు విద్యుత్ కొనుగోలు కోసం తాత్కాలిక ఒప్పందాలను కూడా చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి: