జిల్లా పంచాయతీ పర్యవేక్షణాధికారి దాసరి రాంబాబు నాణ్యత, ప్రమాణాలకు విరుద్దంగా కల్లీ బ్లీచింగ్‌ను కొనుగోలుచేసి పంచాయతీలకు చేరవేయటంతో కార్యదర్శులు, సిబ్బంది గగ్గొలు పెట్టారు. దీనిపై జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ త్రిసభ్య కమిటీతో విచారణ చేయించి క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ బుధవారం డీపీవో సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాంబాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
అవినీతికి నాంది
14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే అదునుగా అధికారులు అనుకూలమైన గుత్తేదారులను ఎంపిక చేసుకొని కల్లీ బ్లీచింగ్‌ను జిల్లాలకు తరలించారు. పంచాయతీ కార్యదర్శులు కొందరు డీపీవో దృష్టకి తీసుకొచ్చినా.. దానినే చల్లాలని పురమాయించారు. తొలుత సరఫరా చేసిన బ్లీచింగ్ సంచులను రికార్డులలో నమోదు చేయకుండా తర్వాత చేర్చారు. అదే సమయంలో పంచాయతీ నిధులను ఖర్చుచేసి ఆర్థిక సంఘం నిధులు వినియోగించినట్లు బిల్లుల్లో రాయాలని డీపీవో కార్యాలయం నుంచి కొందరు ఫోన్లలో ఆదేశించారు. ఇందులో సింహభాగం గుంటూరుకు చెందిన ఒకే వ్యక్తి పేరుతో బిల్లులు పంపారు.
త్రిసభ్య కమిటీ విచారణ
జిల్లా పాలనాధికారి నియమించిన త్రిసభ్య కమిటీ మండలాలు, పంచాయతీల్లో విచారణ చేపట్టడంతో పాటు, గుంటూరు డీఎల్‌పీవో కార్యాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన బ్లీచింగ్‌ను పరిశీలించి పరీక్షలకు పంపారు. సేకరించిన నివేదికను కమిటీ పాలనాధికారికి సమర్పించింది. నివేదికను పరిశీలించిన జిల్లా పాలనాధికారి డీపీవోను సస్పెండ్ చేయాలంటూ పంచాయతీ రాజ్ కమిషనర్‌కు సిఫార్సు చేశారు.
స్ర్పేయర్ల కొనుగోలులోనూ అక్రమాలు...
దీంతో పాటుగా పంచాయతీలకు స్ర్పేయర్ల కొనుగోలులోనూ అక్రమాలు జరిగాయని, దీనిపై జిల్లా సంయుక్త కలెక్టర్‌ను విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. బుధవారం రోజున జేసీ పి.ప్రశాంతి జిల్లా పంచాయతీ అధికారులతో పాటు, డివిజనల్ పంచాయతీ అధికారులను విచారించారు. పంచాయతీ అధికారి సస్పెండ్‌తో ఆ శాఖలోని మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాం ఉంది.