CBN HELD STRATEGIC MEETING : ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు 6 గంటల పాటు సాగిన భేటీలో ముందస్తు ఎన్నికలపై చర్చించారు. సీఎం జగన్ ముందుగా ఎన్నికలకు వెళ్తారనే సమాచారం తనకుందని.. వెళ్లినా, వెళ్లకపోయినా ..కేడర్‌ను సంసిద్ధంగా ఉంచాల్సిన తక్షణ కర్తవ్యం పార్టీపై ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికలకు దారితీసే పరిణామాలపై భేటీలో విశ్లేషించారు.
సాధారణ ఎన్నికల లోపు వివేకా నిందితులు ఎవరో తేలుతుంది.!: మార్చి తర్వాత కేంద్రం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే.. ఒకటి రెండు నెలలు తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. చంద్రబాబు, లోకేశ్ సభలకు వస్తున్న ప్రజాదరణకు జడిసి ఓటమి భయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని నేతలు విమర్శించారు. సాధారణ ఎన్నికల్లోపు వివేకా హత్య కేసు నిందితులెవ్వరో తేలిపోతుందని.. ఆలోగా ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారనే చర్చ జరిగింది.
మార్చి తర్వాత చేతులెత్తేసే దిశగా వైఎస్సార్సీపీ: మార్చిలో వచ్చే బడ్జెట్ వెసులుబాటు 3నెలలు ఉపయోగించుకుని తర్వాత చేతులెత్తేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందనే అభిప్రాయానికి సమావేశం వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డిలతో పాటు మొత్తం 75 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ జరిగింది. వీటన్నింటిని నుంచి తప్పించుకునేందుకు విశాఖ రాజధాని రెఫరెండంగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లచ్చనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేశారు.
5 పార్లమెంట్ జోన్లలో పోల్ మేనేజ్మెంట్: ముందస్తు ఎన్నికలకు కేడర్‌ను ఇప్పటి నుంచే సంసిద్ధం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆమేరకు ఈనెల 21 నుంచి 5 రోజుల పాటు 5 పార్లమెంట్ జోన్‌లలో జరిగే విస్తృత స్థాయి సమావేశాల ద్వారా పోల్ మేనేజ్‌మెంట్‌పై కీలకంగా చర్చించనున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఐదేసి పార్లమెంట్ స్థానాలు ఒక జోన్ గా, రాష్ట్రాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించుకుని పోల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలను అనుకూల ఓటుగా మలచుకునే లక్ష్యంతో ఈ సమావేశాలు .. 21న కడప, 22న నెల్లూరు, 23న అమరావతి, 24న ఏలూరు, 25న విశాఖలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి పల్లె నిద్ర పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశమున్నందున.. అందుకు ధీటుగా "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి " కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు: మేలో NTR శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే చర్చ సమావేశంలో జరిగింది. మహానాడు ద్వారా జరిగే ఈ వేడుకను రాజమహేంద్రవరంలో చేపట్టాలనే యోచనలో పార్టీ ఉంది.
ఇవీ చదవండి: