NO SPECIAL STATUS FOR AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్‌చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని ఆయన తెలిపారు. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదని స్పష్టం చేశారు.
ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధులు బదలాయించేందుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచిందని పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని తెలిపారు. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోంది అని కేంద్ర మంత్రి వివరించారు.
ఇవీ చదవండి: