Devadaya lands are occupied by YCP leaders: గుంటూరు జిల్లా పొన్నూరులో భావన్నారాయణ స్వామి ఆలయానికి సర్వే నంబర్ 213/1Aలో 19.98 ఎకరాల భూమి ఉంది. మొత్తం 14మంది రైతులకు ఈ భూమిని అధికారులు కౌలుకు ఇచ్చారు. 2025 వరకు భూములపై లీజు హక్కులు రైతులకున్నాయి. వరి పంటతో పాటు రబీలో జొన్న, మొక్కజొన్న, వేసవిలో కూరగాయలు సాగుచేస్తుంటారు.
ఈ భూముల్లో రహదారి వెంట ఉన్న 9.04 ఎకరాల భూములను 11 ఏళ్లు లీజుకు ఇవ్వటానికి.. ధార్మిక పరిషత్ అనుమతి ఇచ్చింది. అయితే ఆలయ భూములు వ్యవసాయేతర అవసరాలకు లీజుకివ్వడాన్ని ధర్మకర్త వ్యతిరేకించారు. అలాగే రైతుల్లో కొందరు.. తమకు 2025 వరకు లీజు గడువు ముగిసే వరకు తామే సాగుచేసుకుంటామని చెప్పారు. జీవనోపాధి కల్పిస్తున్న భూములను సాగేతర అవసరాలకు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. కానీ మెజారిటీ రైతులు లీజుకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని రాసిచ్చారు.
11ఏళ్ల లీజుకు భూములు.. ఈ మేరకు దేవాదాయ అధికారులు పంపిన నివేదిక ఆధారంగా ధార్మిక పరిషత్ లీజుకు ఆమోదం తెలిపింది. దీంతో బహిరంగవేలం వేసి 11ఏళ్ల లీజుకు భూములు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. పొన్నూరు పట్టణానికి సమీపంలో గుంటూరు- బాపట్ల రహదారి పక్కనే ఈ భూములు ఉండటంతో కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. విలువైన భూములను వేలంలో దక్కించుకోవడానికి ఇక్కడి ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నారు. అధికారమే అండగా ఒక్కో ప్రక్రియ పూర్తిచేసుకుంటూ లీజు కోసం బహిరంగవేలానికి అనుమతులు సాధించారు. అక్కడ కూడా తన అనుచరుల పేరుతో భూములు దక్కించుకుని నిర్మాణాలు చేయాలన్న యోచనలో ఉన్నారు.
ధర్మకర్త వ్యతిరేకిస్తున్నా అధికార బలంతో ముందుకు.. ఆలయ భూములు ఒకసారి లీజుకు ఇస్తే దక్కకుండా పోతాయని ధర్మకర్త వ్యతిరేకిస్తున్నా అధికార బలంతో ముందుకు వెళుతున్నారు. ముందస్తు వ్యూహంతోనే లీజు పేరుతో భూములు కైంకర్యం చేయడానికి పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలిసి టీడీపీ నేత నరేంద్ర ఆ భూముల్లో ఆందోళన నిర్వహించారు. కోట్ల విలువైన భూముల్ని కొట్టేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దేవాదాయ శాఖ అధికాల తీరుపైనా మండిపడ్డారు.
ముందస్తు పథకంతోనే.. లీజుకు తీసుకున్న వారు అక్కడ ఏవైనా నిర్మాణాలు చేస్తే వాటిని కూల్చటానికి వీలుండదు. ఆ తర్వాత భూములు వారి సొంతమవుతాయనే ఉద్దేశంతోనే ధర్మకర్త వ్యతిరేకించారు. అయినా దేవాదాయశాఖ ముందుకెళ్లడమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ నిర్వహణ కోసం పూర్వకాలంలో దాతలిచ్చిన భూములను.. ఇప్పుడు వేరే అవసరాలకు లీజుకు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.
పావులు కదుపుతున్న ప్రజాప్రతినిధులు.. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన కొన్ని భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆలయానికి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన వారు మిగతా భూముల్ని సైతం ఇలా లీజుల పేరిట కట్టబెట్టడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా భూములపై మాత్రం అవ్యాజప్రేమ కనబరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి కృషిచేయాల్సిన ప్రజాప్రతినిధులు సొంత ఆదాయ మార్గాలకు ఆలయభూములను వాడుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.