కరోనా కారణంగా నిలిచిపోయిన సికింద్రాబాద్-రేపల్లె డెల్టా రైలును.. దాదాపు ఏడాది తరువాత అధికారులు పునఃప్రారంభించారు. ఈరోజు నుంచి తీర ప్రాంతవాసులకు డెల్టా రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే రైలు కాచిగూడలో.. రాత్రి 10:10 గంటలకు బయలుదేరి మల్కాజ్గిరి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, గుంటూరు, వేజండ్ల, తెనాలి, చినరావూరు, వేమూరు, భట్టిప్రోలు, పల్లికోన మీదుగా.. ఉదయం 5:50 గంటల సమయానికి రేపల్లె చేరుకుంటుంది. తిరిగి రేపల్లెలో రాత్రి 10:40 కి బయలుదేరి.. ఉదయం 07:05 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ప్రయాణికులు రిజర్వేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
టిక్కెట్టు ధరలు
రేపల్లె నుంచి కాచిగూడ సాధారణ తరగతి టిక్కెట్టు ధర రూ.150, స్లీపర్ రూ.315, తృతీయ శ్రేణి ఏసీ కోచ్ కు రూ. 875 ధరగా నిర్ణయించారు. రేపల్లె నుంచి గుంటూరు వెళ్లేందుకు.. టికెట్ ధర రూ.75 గా నిర్ణయించారు.
తొలిసారి విద్యుత్‌తో నడుస్తుంది
డెల్టా రైలులో మొత్తం 20 బోగీలు ఉండగా.. సాధారణ బోగీలు 9, స్లీపర్ 8 ,తృతీయ శ్రేణి 1, గాడ్ కమ్ లగేజీ భోగిలు 2 ఉంటాయి. అయితే రేపల్లె రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కొత్తలో.. బొగ్గుతో నడిచే రైలు, ఆ తర్వాత డీజిల్‌తో మాత్రమే రైళ్లు నడిచేవి. అభివృద్ధి పనుల్లో భాగంగా.. రూ.35 కోట్లతో తెనాలి-రేపల్లె రైలు మార్గం విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావడంతో తొలిసారి విద్యుత్‌తో నడిచే రైలు ప్రారంభం కానుంది.
స్థానికుల సంతోషం..
డెల్టా రైలు పునఃప్రారంభంపై తీర ప్రాంతం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ ధరలు గతంలో కంటే అధికంగా ఉన్నాయని.. ధరలు తగ్గించాలని కోరుతున్నారు.