గుంటూరు జిల్లా ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరిగేలా... వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ అత్యాధునిక వసతులు కల్పించింది. అంకితభావం కలిగిన ప్రసూతి వైద్యుల్ని నియమించింది. వీరు సాధారణ ప్రసవాలతో పాటు అవసరమైన వారికి సిజేరియన్ సేవలను కూడా అందిస్తున్నారు. దీంతో సర్కారీ దవాఖానాల్లో ప్రసవానికి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఒక్క తెనాలి ఆస్పత్రిలోనే నెలకు 350 నుంచి 400 వరకు కాన్పులు జరుగుతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే బాలింతలకు ఏడు రోజుల పాటు బలవర్థకమైన ఆహారం అందించాలని, వారితో పాటు శిశువులూ ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ‘ఆహార పట్టిక’ను రూపొందించింది. అది క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించింది. సర్కారీ ఆస్పత్రుల్లకు వచ్చే రోగులకే కాకుండా సహాయకులకూ ఇకపై ఆహారం అందించనున్నట్టు ప్రభుత్వం ఇటీవల స్పష్టంచేసింది. అయితే బాలింతలకే లక్ష్యం మేరకు ఆహారం అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సహాయకులకు ఆశించిన స్థాయిలో ఎలా అందిస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు (ఏపీవీవీపీ) పరిధిలో గుంటూరులో ఓ జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 15 సీహెచ్‌సీలు, ఒక పీహెచ్‌సీ ఉన్నాయి. విటిలో కాన్పులు జరుగుతున్నాయి. ప్రసవించిన తల్లులకు, వారికి తోడుగా వచ్చిన వాళ్లకు భోజనం అందటం లేదు.
బాలింతలకు ఏడు రోజుల పాటు అందజేయాల్సిన బలవర్థక ఆహారం
ఉదయం అల్పాహారం: మొదటి రోజు 100 గ్రాముల రొట్టె, 10 గ్రా. బెల్లం, 250 మిల్లీలీటర్ల పాలను అందజేయాలి. అలాగే 2, 5 రోజుల్లో మూడు ఇడ్లీలతో పాటు చట్నీ, 3, 7 రోజుల్లో కిచిడి; 4, 6 దినాల్లో టమాటోబాత్, కట్టెపొంగలి ఇవ్వాలి.
మధ్యాహ్నం: మొదటి రెండ్రోజులూ పైన చెప్పిన పరిమాణంలో రొట్టె, పాలు, బెల్లం అందజేయాలి. మూడు నుంచి ఏడో రోజు వరకు 450 గ్రా. అన్నం, 150 మి.లీ. సాంబారు, గుడ్డు, అరటిపండు, ఓ కప్పు పెరుగుతో పాటు ఆకుకూర పప్పు, సోయాబీన్ కూర ఇవ్వాల్సి ఉంటుంది.
సాయంత్రం: ఏడు రోజులూ 150 మి.లీ. రాగిమాల్ట్, చెరో మూడ్రోజులు పప్పుఉండ, సీజనల్ కాయలు ఇవ్వాలి. ఇక 6 నుంచి 8 గంటల్లోపు వారం రోజులూ 450 గ్రా. అన్నం, 150 మి.లీ. సాంబారు, ఒక గ్లాసు మజ్జిగ, కాయగూరలతో తయారుచేసిన కూరల్ని అందజేయాలి.
క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందంటే..
సోయాబీన్ కూర, బెల్లం, రొట్టె, రాగిమాల్ట్, పెరుగు, మజ్జిగ, పప్పుఉండ, కిచిడీ, కట్టెపొంగలి అసలు అందించడంలేదని బాలింతలు చెప్తున్నారు. ఉప్మా, ఇడ్లీ, చట్నీ, సాంబారు, చక్కెర కలిపిన పాలు, ఆకు, దుంపకూరలు, సాంబారు, ఉడికించిన గుడ్లు, అన్నం, అరటి పండ్లను మాత్రమే గుత్తేదారు పెడుతున్నట్టు వారు పేర్కొన్నారు. అందజేసే ఆహారాన్ని ప్రతి రోజూ ఆర్‌ఎంవోకు చూపాకే పంపిణీ చేయాల్సి ఉన్నా గుత్తేదారులు దీన్ని ఆచరించడంలేదనే ఫిర్యాదులున్నాయి.
ఎక్కువ మందికి ఇంటి నుంచే..
వార్డుల్లో ఉండే బాలింతల్లో సగం మందికి పైగా ఆహారం వారి వారి ఇళ్ల నుంచే వస్తోంది. ఇంటి వద్ద నుంచి తెప్పించుకునే స్థోమత లేని వారే ఆస్పత్రుల్లో అందజేస్తున్న ఆహార పదార్థాలను పెట్టించుకుంటున్నారు. తామే ఆహారాన్ని తెచ్చి బాలింతలకు అందజేస్తున్నట్టు వారి సహాయకులు చెప్పారు.
పక్కాగా అమలు చేయాలని ఆదేశాలిచ్చాం
వైద్యారోగ్య, శిశుసంక్షేమశాఖ ప్రకటించిన ఆహార పట్టికలో పేర్కొన్న పదార్థాలను బాలింతలకు తప్పనిసరిగా అందించాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.100 చొప్పున గుత్తేదారుకు చెల్లిస్తున్నాం. తయారు చేయించిన పదార్థాలను ముందుగా తనకు చూపించడంలేదనే విషయాన్ని ఆర్‌ఎంవో నా దృష్టికి తెచ్చారు. కచ్చితంగా అధికారికి చూపించాకే రోగులకు అందించాలని ఏవోను ఆదేశించా. అదెక్కడా అమలు కావడంలేదని సమాచారం ఉంది. వార్డుల్లో నర్సులెవరూ దగ్గరుండి వాటిని పెట్టించడంలేదని బాలింతల తరుఫు బంధువులు చెప్పారు. అయితే ఇండెంట్ ప్రకారం ఆహారం పెట్టినట్టు బిల్లులు చేయించి ఉన్నతాధికారులకు పంపుతున్నాం. - డాక్టర్ ఎం.సనత్‌కుమారి, ఆస్పత్రి పర్యవేక్షకురాలు, తెనాలి
ఇదీ చదవండి: జాతీయ స్థాయిలో జీవీఎంసీకి గుర్తింపు