Cultivated Area Reduced in Andhra Pradesh: రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఖరీఫ్ సాగు 28 లక్షల ఎకరాలు తగ్గింది. ఇటీవల కొన్ని మండలాల్లో అడపాదడపా వానలు కురిసినా.. ఇంకా వందల మండలాలను వర్షాభావం వెంటాడుతోంది. తెలంగాణలో 1.26 కోట్ల ఎకరాల్లో గింజపడితే.. ఏపీలో ఇప్పటికీ 58 లక్షల ఎకరాల్లో మాత్రమే నాటారు. వినాయక చవితికి పచ్చదనంతో కళకళలాడాల్సిన భూములు బీళ్లుగా మారాయి. కళ్లెదుటే కరవు ఛాయలు కనిపిస్తున్నా.. ముందస్తు కరవు ప్రకటన చేద్దామనే స్పృహ ప్రభుత్వంలో ఏ కోశనా కనిపించడం లేదు.
ఏపీలో ఆహార పంటల సాగు భారీగా తగ్గింది. అయినా పాలకులు కళ్లు తెరవడం లేదు. కనీసం రైతుల్ని ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో సాగు విస్తీర్ణం సాధారణం కన్నా పెరిగింది. ఏపీలో మొత్తం పంటల విస్తీర్ణంతో పోలిస్తే తెలంగాణలో ఏకంగా 68 లక్షల ఎకరాల సాగు అధికంగా ఉంది. రాష్ట్రంలో సాగు పరిస్థితికి ఈ లెక్కలు అద్దం పడుతున్నా.. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటూ పాలకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ అన్నదాతలను కాలానికే వదిలేశారు.
వృద్ధిరేటు పెరగడానికి అదే కారణం.. ప్రభుత్వం సన్నాయి నొక్కులు
రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణంలో 79శాతం మాత్రమే సాగైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాలు మినహా.. మరెక్కడా 100శాతం సాగు చేపట్టలేదు. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 1.60 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా.. 19 వేల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటి విడుదల లేక సాగు గణనీయంగా పడిపోయింది. మాగాణి భూములు బీళ్లుగా మారాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.08 లక్షల ఎకరాలకుగాను ఇప్పటికీ 1.07 లక్షల ఎకరాల్లోనే నాట్లు వేశారు. శ్రీసత్యసాయి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ వరి సాగు తగ్గింది. తెలంగాణలో వరి సాధారణ విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు. ఇప్పటికి 64 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే 128.79శాతం మేర సాగైంది.
ఆహార ధాన్యాల సాగు 25శాతం తగ్గింది. పప్పుధాన్యాల సాగు తెలంగాణలో 58శాతం ఉండగా.. ఏపీలో 53శాతం మాత్రమే. ఏపీలో కేవలం 3.60 లక్షల ఎకరాల్లోనే కంది వేశారు. తెలంగాణతో పోలిస్తే 1.13 లక్షల ఎకరాలు తగ్గింది. తెలంగాణలో మొత్తం 45 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. ఆంధ్రప్రదేశ్‌లో 9.90 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
తగ్గిన పొగాకు సాగు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు
పత్తి అధికంగా సాగయ్యే కర్నూలు జిల్లాలో 6.91 లక్షల ఎకరాల్లో పత్తి వేయాల్సి ఉంటే.. ఇప్పటికీ 4.89 లక్షల ఎకరాల్లోనే వేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ సాగు 50శాతం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో నూనె గింజల సాగు భారీగా తగ్గింది. వేరుసెనగ అత్యధికంగా సాగయ్యే రాయలసీమలో వర్షాలు అనుకూలించక విత్తనాలు వేయలేదు. 16.10 లక్షల ఎకరాలకుగాను 7.32 లక్షల ఎకరాల్లోనే గింజపడింది. నూనె గింజల పంటల సాగు తెలంగాణలో 93.65శాతం ఉండగా.. ఏపీలో 50శాతం మాత్రమే.
ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. సాధారణ వర్షపాతం కంటే ఆగస్టులో 53శాతం తక్కువ వానలు కురవగా.. 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 383 మండలాల్లో పొడి వాతావరణ ఛాయలున్నాయి. సెప్టెంబరులో కురిసిన వానలు సాగుకు అంతగా అనుకూలించలేదు. ఇప్పటికీ 320 మండలాల్లో లోటు వర్షపాతమే. 9 జిల్లాలు లోటులోనే ఉన్నాయి. ప్రాజెక్టుల్లో నీరు లేక వరి నాట్లు పడలేదు. మిరప సాగు చేస్తే.. నీరందుతుందా? లేదా? అనే అనుమానాలు రైతుల్ని వెంటాడుతున్నాయి. పత్తి, కంది, వేరుసెనగ దిగుబడులూ గణనీయంగా తగ్గిపోతాయనే ఆందోళనలో రైతులు ఉన్నారు.
వ్యవ‘సాయం’ అందుకోవడంలోనూ ఏపీ దిగదుడుపే!.. గణంకాలు విడుదల చేసిన కేంద్రం