CS Jawahar Reddy Review Meeting with Collectors: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వాహణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్పరెన్సు ద్వారా అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్పరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"
నెల 25 నాటికి పూర్తి చేయాలి: పోలింగ్ స్టేషన్లు, కనీస మౌలిక వసతుల్ని ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో ఈ పోలింగ్ స్టేషన్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పని సరిగా చేపట్టాలని సూచించారు. విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ప్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు తప్పని సరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు అక్రమ మద్య రవాణాను అరికట్టటంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, చెక్ పోస్టులు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలోని కేసులపై చార్జిషీట్లు దాఖలు తదితర అంశాలను పోలీసు అధికారులతో సమీక్షించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్ద ఎత్తున నియమించాలని సూచించారు.
అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు - ఈనెల 22న ఓటర్ల తుది జాబితా: ఈసీ
ఎన్నికల విధులకు ఉపాధ్యాయులు: గత కొంత కాలంగా ఎన్నికల విధులకు ఉపాధ్యాయులతో కాకుండా సచివాలయ సిబ్బంధితో నిర్వహించాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులను తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను డీఈఓలు సేకరించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,165 పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా టీచర్లను నియమించాల్సిందిగా సీఈసీ ఆదేశాల మేరకు హుటాహుటిన ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు.
సచివాలయ సిబ్బంది మినహా ఇతర ప్రభుత్వ శాఖలు విభాగాల్లో ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా ఇవ్వాల్సిందిగా సీఈఓ కార్యాలయం జిల్లా కలెక్టర్లను కోరింది. జిల్లాల వారీగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు, అలాగే ఎన్నికల విధులకు అవసరమైన ఉపాధ్యాయులు ఎంతమంది, గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని మినహాయించి ఎన్నికల విధులకు అందుబాటులో ఉన్న ఇతర విభాగాల ఉద్యోగులు ఎందరు అనే వివరాలను సేకరించిన జిల్లా కలెక్టర్లు ఆ సమాచారాన్ని సీఈఓ కార్యాలయానికి పంపినట్టు సమాచారం.