ఎన్నికల నిర్వహణపై సీఎస్ సమీక్ష ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, క్యూలైన్ల నిర్వహణ వంటి సేవల కోసం... వివిధ శాఖల్లో పనిచేస్తున్న యూనిఫార్మ్ అధికారులు, ఉద్యోగుల సేవలువినియోగించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ వెల్లడించారు. అమరావతి సచివాలయంలో ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని అవసరం మేరకు ఎన్నికల విధులకు కేటాయించాలని ఆదేశించారు.
ఎన్నికల బందోబస్తు కోసం 11 శాఖలకు సంబంధించి గుర్తించిన యూనిఫార్మ్ సర్వీసుల ఉద్యోగులను ఆయా శాఖల అధికారులు వెంటనే కేటాయించాలని సీఎస్ ఆదేశించారు. రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే అందుబాటులో ఉన్న పోలీస్, కేంద్ర బలగాలకు చెందిన పోలీస్ సిబ్బందికి తోడు.. మిగతా శాఖల ఉద్యోగుల సేవలు అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు సహకరించి.. సిబ్బంది వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు అందించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసం ఇద్దరు ముగ్గురు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీకి సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అటవీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తూనికలు కొలతలు శాఖ, ఏపీ ట్రాన్స్‌కో, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, హోమ్ గార్డ్సు ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించామని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్.పి. ఠాకూర్... సీఎస్‌కు వివరించారు. అలాగే పోలీస్ శాఖలో భాగమై ఉన్న అనిశా, మెరైన్ పోలీస్, ఆక్టోపస్, సిఐడి, అగ్నిమాపక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి..
జగన్ బెయిల్ రద్దు మా పరిధిలో లేదు: ఈసీ ద్వివేది