ఆకట్టుకునే బొమ్మలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి.. వాటిని మరింత అందంగా అమర్చి దృశ్య రూపకంగా తెలుగు సంప్రదాయాలను వివరిస్తున్నారు గుంటూరు జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన చక్రవర్తి. నల్లూరులోని శ్రీ గాయత్రి సేవ హృదయ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న ఆయనకు.. తెలుగు సంప్రదాయం అంటే ఎంతో మక్కువ. తెలుగు పండుగల ప్రాముఖ్యతను నేటి తరాలకు వివరించేందుకు చాలా కాలంగా బొమ్మల కొలువులు నిర్వహిస్తూ.. సంస్కృతి సంప్రదాయల పరిరక్షణలో భాగమవుతున్నారు.
తెలుగు పండుగల విశిష్టత తెలిపేలా..
ప్రతీ పండుగకు గ్రామాలు, పట్టణాల్లో బొమ్మల కొలువుల ప్రదర్శనలు చేస్తున్నారు చక్రవర్తి. ఈ ప్రదర్శనలతో... రామాయణ, భారత, భాగవత కథలను అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తున్నారు. దసరా, సంక్రాంతి, దీపావళి వంటి తెలుగు పండుగల విశిష్టతను చెప్పేలా.. బొమ్మలు ప్రదర్శిస్తున్నారు.
జగన్మోహన పేరుతో బొమ్మల కంటైనర్లు ఏర్పాటు
బొమ్మల కొలువుల్లో.. పెళ్లిళ్ల సందడిని కళ్ళకు కట్టినట్లు చూపేవి, శివ వైభవం, విష్ణు వైభవం, దేవీ వైభవంతో పాటు ఎన్నో జంతువులు, పక్షులు, గతంలో వాడిన ప్రయాణ సాధనాలు, హస్తకళతో చేసిన అందమైన బొమ్మలు, పూర్వీకుల ఆచార వ్యవహారాలకు సంబంధించినవి ఉన్నాయి. ఆధ్యాత్మికతను తెలియజేసే భగవంతుని ప్రతిమల లాంటివి ఎన్నింటినో.. చక్రవర్తి సేకరించారు. దేశంలో ఎన్నో చోట్ల తిరిగి ఇప్పటి వరకు సుమారు లక్షకు పైగా బొమ్మలు జత చేశారు. శాశ్వతంగా ఈ బొమ్మల కొలువు ప్రదర్శన ఉంచేలా ఆశ్రమ ప్రాంగణంలో జగన్మోహన పేరుతో కంటైనర్లు ఏర్పాటు చేసి.. అందులో బొమ్మలను అందుబాటులోకి తెచ్చారు.
అరుదైన వస్తువుల సేకరణ
ఆశ్రమం లోపల బుద్ధుని బొమ్మలు ఏర్పాటు చేశారు. మన పూర్వీకులు వాడిన ఎన్నో అరుదైన ఇత్తడి సామాన్లు సేకరించి భద్రపరిచారు. ఆశ్రమ గోడలకు అందమైన కళారూపాలున్న చిత్రాలు అమర్చారు. ఓ వైపు వృద్ధులకు సేవ చేస్తూ మరోవైపు బొమ్మల కొలువుతో తెలుగు సంప్రదాయ విశిష్టతను తెలియజేస్తున్నారు. వీటితో పాటు గ్రామస్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలను బోధిస్తున్నారు చక్రవర్తి.
నేటి తరానికి నాటి విశేషాలు
కనుమరుగవుతున్న హిందూ సంప్రదాయాలను నేటితరానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఇలా బొమ్మల కొలువులు నిర్వహిస్తున్నానని చక్రవర్తి చెబుతున్నారు. ఇప్పటికీ చాలాచోట్ల ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల నేటి యువత, చిన్నారులకు తెలుగు సంస్కృతిపై అవగాహన వస్తుందని సందర్శకులు చెబుతున్నారు. చక్రవర్తి శ్రమను, ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: