అగ్రిగోల్డ్ భాదితులను ఆదుకోవాలని కోరుతూ... ఈ నెల 31న గుంటూరు నుంచి తాడేపల్లి సీఎం కార్యాలయం వరకు అగ్రిగోల్డ్ భాదితుల విజ్ఞాపన యాత్ర చేపడతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే అగ్రిగోల్డ్ భాదితుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి.. నేడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు వారికి న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినతిపత్రాలు అందజేస్తాం...
అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 15 నుంచి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈనెల 28 లోపు... వైకాపా నేతలు, ముఖ్యమంత్రి స్పందించి అగ్రిగోల్డ్ భాదితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి...
కృష్ణా నదీ జలాల విషయంలో నెలకొన్న సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ముప్పాళ్ల కోరారు. పాదయాత్రలో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన సీఎం జగన్... నేడు జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి మోసగించారని అన్నారు. తక్షణమే జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: