కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రేపు చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గుంటూరులో సీపీఐ, ఏఐటీయూసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి హిందూ కళాశాల కూడలి వరకు కార్మిక సంఘాలు ర్యాలీ చేశాయి. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. స్వదేశీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ.. విదేశీ పరిశ్రమలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు.
సార్వత్రిక సమ్మె కేవలం కార్మికులకు సంబంధించినది కాదని దేశ రక్షణ కోసం జరుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాధ్ అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ప్రవేశపెట్టిన నూతన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.