గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకి అధికమవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం వరకు గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాల్లోనే ఉన్నాయి. ఈ నెల ఒకటవ తేదీ నుంచి నిన్నటి వరకు జిల్లాలో 2,204 కేసులు వచ్చాయి. ఈ సంఖ్య మార్చి నెలలో నమోదైన మొత్తం కేసులు 2,220కి దగ్గరగా ఉంది.
జిల్లా వ్యాప్తంగా 368 కేసులు నమోదు అవ్వగా... గుంటూరు నగరంలో 119 కేసులు ఉన్నాయి. గరిష్ఠంగా తెనాలిలో 62, తాడేపల్లి 25, మంగళగిరి 24, నరసరావుపేట 20, వినుకొండ 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలోని మొత్తం కేసుల సంఖ్య 80,126కి చేరింది. ప్రస్తుతం1,951 క్రియాశీలక కేసులున్నాయి. కరోనా కట్టడికి అవగాహనా కార్యక్రమాలతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నారు.
నగరంలో అవగాహన కార్యక్రమాలు
కరోనా మహమ్మారిని జయించాలంటే... సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. 15 రోజులుగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్స్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆరు వారాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు మేయర్ చెప్పారు. కొవిడ్ టీకాపై ఉన్న అపోహలు వదిలి.. ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్, జేసీతో పాటుకమిషనర్ చల్లా అనురాధ, జీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల్లో మానసిక సమస్యలు!