cotton framers fire on AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంటను పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మొదట్లో పత్తి ధర క్వింటాకు రూ. 9 వేల నుంచి రూ. 10 వేల వరకు పలికింది. దీంతో రైతులు.. రానూరానూ పత్తికి ధర భారీగా పెరుగుతుందన్న ఆశతో.. పండించిన పంటనంతా ఇళ్లలోనే నిల్వ ఉంచారు. కానీ, రైతులు ఆశించినట్లు పత్తికి గిట్టుబాటు ధర రోజుకు రోజుకు తగ్గిపోయి.. ప్రస్తుతం క్వింటా పత్తి ధర రూ. 7వేలకు పడిపోయింది. దీంతో ఇప్పుడు ఇళ్లలో నిల్వ ఉంచిన పత్తిని అమ్మాలా?, వద్దా? అని రైతులు అయోమయంలో పడ్డారు. పత్తి కొనేవారు లేక, సీసీఐ ముందుకు రాక.. పత్తి నిల్వలు మగ్గిపోయి, బరువు తగ్గిపోతుండడంతో ఏం చేయలో అర్ధంకాక రైతులు.. తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రంలో పత్తిని విస్తారంగా పండించే ప్రాంతాల్లో.. ఉమ్మడి గుంటూరు జిల్లా ఒకటి. ఈ ఏడాది గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 4.5 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. కానీ.. గులాబీ రంగు పురుగు దాడితో ఆశించిన దిగుబడులు రాలేదు. ఎకరాకు సరాసరిన 5 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి ధర మొదట్లో క్వింటా 9వేలు నుంచి 10వేల రూపాయల వరకు పలికింది.
దీంతో కొందరు రైతులు.. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. అధిక ధరలు కొన్ని రోజులు మాత్రమే ఉండి.. ఆ తర్వాత తగ్గడం మొదలైంది. పతనం ప్రారంభమైన తర్వాత 8వేలకు కూడా కొందరు అమ్ముకున్నారు. ధర మళ్లీ పెరుగుతుందని భావించిన రైతులు.. పంటను నిల్వ ఉంచారు. ఎక్కువ రోజుల పాటు పత్తి నిల్వ ఉండటం వల్ల బరువు తగ్గిపోవటంతో పాటు.. ఎలుకలు, పందికొక్కులు పాడు చేస్తున్నాయి. ప్రస్తుతం క్వింటా పత్తి ధర 7వేలకు పడిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆ ధరకు అమ్మితే గిట్టుబాటు కాదని.. మంచి ధర వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.
20 ఎకరాల్లో పత్తి పంటను వేశాను. పత్తి తీసిన కూలీలకు 0కిలోకి రూ.2 చొప్పున ఇచ్చాను. చివరికి పంట వల్ల చాలా నష్టం వచ్చింది. మొదట్లో పత్తి ధర రూ.10వేలకు కొన్నారు. ఇప్పుడు రూ.7వేలు అంటున్నారు. సీసీ వాళ్లు కూడా పత్తిని కొనమంటున్నారు. రైతు అంటేనే ఈ రాష్ట్రంలో ఎవరికీ లెక్కేలేదు. పత్తి పంటను పండించడానికి చాలా ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. ప్రభుత్వం స్పందించి పత్తి ధర పెంచి రైతులను ఆదుకోవాలి. -పత్తి రైతు, గుంటూరు జిల్లా
సాధారణంగా పత్తి సీజన్ అక్టోబర్‌తో మొదలై ఫిబ్రవరి నాటికి 80 శాతానికిపైగా మార్కెట్‌కు వస్తుంది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పండిన పత్తిలో సగం కూడా ఇంకా మార్కెట్‌కు రాలేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా కొందరు మార్కెట్‌కు తరలించకుండా నిల్వ చేశారు. జౌళి పరిశ్రమలో ఎగుమతులు పుంజుకోకపోతే పత్తి ధరలు పెరిగే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుత మార్కెట్ ధరకు పంటను అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీఐలను తెరిపించి.. పత్తి ధరను పెంచాలని రైతులను వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి