అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ, రాష్ట్రంలోని వివిధ సమస్యలపై 'ముఖ్యమంత్రితో మాట్లాడదాం' పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరి కాంగ్రెస్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు నిర్వహించిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మహిళా నేత సుంకర పద్మశ్రీ ఇతర నేతలను పోలీసులు అడ్డగించారు. తాడేపల్లి వెళ్లేందుకు అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. అయినా ముందుకెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి తీరుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే.. ఈ నెల 7న నిరసన'