Confusion over the Single Subject Program in Degree: ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదలు కాగా.. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అన్వేషిస్తున్నారు. డిగ్రీలో చేరితే ఏ ప్రోగ్రామ్ ఎంచుకోవాలి? దీంట్లో మొదటి, రెండు, మూడు, నాలుగు సంవత్సరాల్లో ఏ సబ్జెక్టులుంటాయి? అనేదాన్ని పరిశీలిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో మూడు సంవత్సరాలు పూర్తయ్యాక కావాలనుకుంటే బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మూడేళ్లలో వెళ్లిపోతే ఏ సబ్జెక్టుల్లో నైపుణ్యం వస్తుంది? అనేది తెలిస్తే ఆయా ప్రోగ్రామ్‌లలో చేరేందుకు విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
దీనిపై కళాశాలల మేనేజ్మెంట్లకు సైతం స్పష్టత ఉంటే ఏ ప్రోగ్రామ్‌లను నిర్వహించొచ్చు? అందుకు అవసరమయ్యే అధ్యాపకుల లభ్యతపై క్లారిటీ వస్తుంది. యాజమాన్యాలు, స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించకపోగా పాఠ్యప్రణాళిక రూపకల్పనలోనూ ఆలస్యం అవుతోంది. సిలబస్‌పై క్లారిటీ ఇవ్వకుండానే మూడు సబ్జెక్టుల ప్రోగ్రామ్ నుంచి సింగిల్ సబ్జెక్టు ప్రోగ్రామ్‌కు మార్చుకోవాలంటూ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చింది.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ సబ్జెక్టు ప్రోగ్రాంలో ముఖ్యంగా ఒక సబ్జెక్టు చదవాలి. మైనర్‌గా మరో సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో స్టూడెంట్ ఇష్ట ప్రకారం ఎంచుకోవచ్చు. ఈ రెండు కాకుండా మూడో సబ్జెక్టుగా స్కిల్ డవలప్మెంట్కి సంబంధించినవి ఉంటాయి. ఉదాహరణకు గతంలో బీఎస్సీ చదివేవారు ఇప్పుడు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాలలో ఒక దాన్ని మేజర్ సబ్జెక్టుగా సెలక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గణితాన్ని మేజర్‌గా ఎంచుకుంటే మైనర్‌గా భౌతిక, రసాయనశాస్త్రాలే కాకుండా డ్యాన్స్లాంటి వాటిల్లో నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు.
ఇదికాకుండా నైపుణ్యాభివృద్ధి కింద డిజిటల్, డేటా, బిజినెస్ నైపుణ్యాలలాంటి వాటిల్లో ఒక్కదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. మొదటి, రెండో సంవత్సరం వరకు ఇదే విధానం కొనసాగుతుంది. కానీ మూడో సంవత్సరానికి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది? ఏ సబ్జెక్టులుంటాయనే దానిపై స్పష్టత లేదు. మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టులకు కొన్ని క్రెడిట్లు కేటాయిస్తారు.
మూడు సంవత్సరాల డిగ్రీ, నాలుగు సంవత్సరాల ఆనర్స్ డిగ్రీ పూర్తయ్యాక మైనర్ సబ్జెక్టులోనూ పోస్టుగ్రాడ్యుయేషన్ చేసేందుకు యూజీసీ రెగ్యులేషన్లు తీసుకొచ్చింది. ఆనర్స్ డిగ్రీ ప్రవేశపెడుతున్నందున సబ్జెక్టు స్పెషలైజేషన్ ఏ సంవత్సరం ఉంటుందనే దానిపై విద్యార్థులకు, మేనేజ్మెంట్లకు క్లారిటీ లేదు. నూతన విద్యా విధానం ప్రకారం మూడు సంవత్సరాల తర్వాత అవసరమైతే స్టూడెంట్ బయటకు వెళ్లిపోవచ్చు. అలాంటప్పుడు సబ్జెక్టు స్పెషలైజేషన్ మూడో సంవత్సరంలో ఉంటుందా? నాలుగో సంవత్సరంలో వస్తుందా? అనేదానిపై మేనేజ్మెంట్లు, స్టూడెంట్స్లోనూ పలు ప్రశ్నలు ఉన్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం కొత్త విధానం ప్రారంభించాల్సి ఉన్నందున.. ఈ ఒక్క సంవత్సరం కోసం పాఠ్యప్రణాళిక ఖరారు చేస్తే సరిపోతుందనే పద్ధతిని పాటిస్తున్నారు. ఆనర్స్ డిగ్రీలో కొత్త విధానాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు దీనిపై ముందునుంచే సిద్ధం కావాల్సి ఉండగా హడావుడిగా ఇటీవలే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో 3, 4 ఏళ్లకు సిలబస్ రూపకల్పనకు టైమ్ లేదంటూ వాయిదా వేశారు.
ఇవీ చదవండి: