కరోనా టీకా పంపిణీలో జిల్లా యంత్రాంగానికి ప్రణాళిక లోపించింది.ఇది క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తోపులాట, గదరగోళానికి దారితీస్తోంది. టీకా పంపిణీ ఏ ప్రాంతంలో ఏ రోజున ఉంటుందో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు సమాచారం తెలియపరచడం లేదు. కనీసం 24 గంటల ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు టీకా పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని కిందిస్థాయి యంత్రాంగాన్ని ఆదేశించి ఆ మేరకు మొక్కుబడిగా టీకా పంపిణీ నిర్వహించడం తప్ప ప్రణాళికాబద్ధంగా దాని నిర్వహణకు చర్యలు తీసుకోవడం లేదనే అపవాదును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మూటగట్టుకుంది.
శుక్రవారం గుంటూరు, నరసరావుపేట పట్టణాల్లో రెండు చోట్ల టీకా పంపిణీలో చోటుచేసుకున్న తోపులాటలు, గందరగోళ పరిస్థితే అందుకు నిదర్శనం. గుంటూరులోని మల్లికార్జునపేట, శ్రీనివాసరావుతోట, గుండారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీకా కోసం కేంద్రాలకు ప్రజలు పెద్దఎత్తున ఉదయాన్నే చేరుకున్నారు. అయితే ఆ కేంద్రాల్లో వందేసి టోకెన్లు ఇచ్చి యంత్రాంగం సరిపుచ్చుకుంది. అయితే యంత్రాంగం రాక మునుపే ప్రజలు వందల సంఖ్యలో టీకా కోసం వచ్చి క్యూలో నిలబడ్డారు.
వారందరికీ సరిపడా డోసులు లేవు. మరోవైపు రెండో డోసు వేయించుకునేవారికే ప్రాధాన్యం ఇవ్వటంతో మొదటిసారి టీకా వేయించుకునేందుకు వచ్చినవారు అప్పటి దాకా తమను క్యూలో నిలబెట్టి రెండోడోసు వారికే టీకా వేస్తామని చెప్పటం ఏమిటని ఆయా కేంద్రాల వద్ద యంత్రాంగంతో వాదనలకు దిగారు. ఒకానొక సమయంలో ప్రజలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో అప్పటికప్పుడు పోలీసులను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వ్యాక్సిన్ వేస్తారని మాత్రమే తెలియజేయడంతో శుక్రవారం ఈ రెండు చోట్లా కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు.
అధికారులు, వైద్యసిబ్బంది తీరుని ప్రజలు తప్పుబట్టారు. ఎన్ని డోసులు అందుబాటులో ఉన్నాయో అంతమందికి టోకెన్లు వాలంటీర్ల ద్వారా ముందుగానే పంపిణి చేస్తే బాగుంటుందని వారు సూచించారు. లేదా వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి అర్హులకు టీకా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: