CM Jagan New Schemes for Student Votes: ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థుల ఓట్లపై సీఎం జగన్ కన్నుపడింది. బటన్ నొక్కి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే పథకాల నగదు జమ చేస్తున్నా.. అని జగన్ తరచూ ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల అమలు విషయంలో మాత్రం ఈ హామీ నుంచి జగన్ కాస్త యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లు.. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం నిధులు నేరుగా విద్యార్థి తల్లీ ఖాతాలో జమ అయ్యాయి.
Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక
ఎక్కువ మంది విద్యార్థులకు ఓటేసే హక్కు.. ఇకపై ఈ పథకాల ద్వారా ఇచ్చే ఆర్థికసాయం ఇకపై జమ కావాలంటే విద్యార్థి, విద్యార్థి తల్లి ఇద్దరూ కలిసి ఉమ్మడి ఖాతా తెరవాల్సిందేనని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడీ ఆదేశాలు ఎందుకనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.. తాను అందించే నగదు విద్యార్థులకు తెలియలేదనే బెంగ ముఖ్యమంత్రికి వచ్చినట్టుంది.. పైగా ఎన్నికలేమో సమీపిస్తున్నాయి. ఈ పథకాల కింద ఆర్థికసాయం పొందే వారిలో ఎక్కువ మంది విద్యార్థులకు ఓటేసే హక్కు ఉంటుంది. అందుకే మన సీఎం వారి ఓటుపై కన్నేశారు. ప్రభుత్వ అందిస్తున్న సాయం గురించి వారికీ ప్రత్యక్షంగా తెలియాలని ఉమ్మడి ఖాతాను తెరపైకి తెచ్చారు. పథకాల నుంచి లబ్ధి పొందే వారందరూ.. ఈ నెల 24లోగా ఉమ్మడి ఖాతాలు తెరవాలని ప్రభుత్వం పేర్కొంది.
నగదు తీయాలంటే ఇద్దరూ సంతకాలు పెట్టాల్సిందే.. ఉమ్మడి ఖాతాలో విద్యార్థి ప్రాథమిక ఖాతాదారుగా, తల్లి రెండో ఖాతాదారుగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖాతాకు ఎలాంటి డెబిట్ కార్డు సౌకర్యం ఉండకూడదు. నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మార్పిడి సదుపాయాలు లేవు. నగదు తీయాలంటే విద్యార్థి, తల్లి ఇద్దరూ సంతకాలు పెట్టాల్సిందే. దీనిపైనే విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువు కోసం విద్యార్థులు, వృత్తి అవసరాల రీత్యా తల్లిదండ్రులు వేర్వేరు చోట్ల నివసించే అవకాశముంది. తాజా నిబంధనల ప్రకారం విద్యాదీవెన కింద ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్‌మెంటును కళాశాలలకు చెల్లించాలంటే వారు బ్యాంకు వద్దకు రావాల్సిందే.
తల్లి మరణిస్తే తండ్రితో సంయుక్త బ్యాంకు ఖాతా.. తల్లి మరణిస్తే తండ్రితో సంయుక్త బ్యాంకు ఖాతాను విద్యార్థి ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇద్దరూ లేకపోతే సంరక్షకుడితో ఉమ్మడి ఖాతా తెరవాల్సిందేనని స్పష్టం చేసింది. ఉమ్మడి ఖాతా తక్షణమే తెరిపించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ప్రతి బ్యాంకు బ్రాంచి పనిదినాల్లో కనీసం వంద ఉమ్మడి ఖాతాలు తెరిపించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.