CM Jagan Neglected Tidco Houses: జగన్ పేదలపై ఎంత కక్షతో వ్యవహరిస్తారో చెప్పేందుకు టిడ్కో ఇళ్ల రద్దే నిదర్శనం. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన 3.13 లక్షల గృహాల్లో జగన్ అధికారంలోకి రాగానే 51 వేల మంది పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేసి 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి 25 శాతం కన్నా తక్కువ పూర్తయ్యాయని సాకు చూపారు. 25 శాతం కంటే తక్కువ కట్టినా అవి వందల కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినదే కదా? ఇలా అర్ధాంతరంగా నిలిపేస్తే ప్రజాధనం వృథానేగా! ఆ ఇళ్లను గత ప్రభుత్వం కేటాయించిందీ పేదలకే కదా? వారేం పాపం చేశారు? వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నాలుగు, రెండు అంతస్తుల్లో టిడ్కో భవనాలను ఇలానే పేదలకు దక్కకుండా చేశారు. అక్కడే పునాది దశ వరకు కట్టిన టిడ్కో నిర్మాణాలను పూర్తిగా తొలగించేందుకు కోటి వెచ్చిస్తున్నారు.
చెప్పిన 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్నైనా వేగంగా పూర్తి చేస్తున్నారా? అంటే అదీలేదు. సమీక్ష నిర్వహించినప్పుడలా త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ మాటలు చెప్పడమే తప్ప సకాలంలో పూర్తి చేసి అప్పగించే ఆలోచన ఆయనకు ఏకోశానా లేనట్టుంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ వీటిలో 60 వేల గృహాల ఇళ్ల నిర్మాణం కనీసం అడుగు కూడా పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదట్లో ఇళ్ల నిర్మాణాన్ని తీవ్ర జాప్యం చేయడంతో పాత ధరలకే ఈ ఇళ్లను కట్టలేమని రెండు ప్రధాన గుత్తేదారు సంస్థలు తేల్చిచెప్పాయి.చాలా చోట్ల టిడ్కో గృహాల పనుల్ని నిలిపేశాయి.
టిడ్కో లబ్ధిదారులకు షాక్ ఇస్తున్న బ్యాంకర్లు - ఇళ్లు అప్పగించకముందే రుణ వాయిదా నోటీసులు
ఇప్పటికీ టిడ్కో ఇళ్లపై లబ్ధిదారుల్ని మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. మొత్తం 2.62 లక్షల గృహాల్లో లబ్ధిదారులకు అప్పగించిన 84 వేల ఇళ్లు కాకుండా మిగతా 1.78 లక్షలు ఎన్నికలలోపు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వడం దాదాపు అసాధ్యమే. వీటిని పూర్తి చేయడానికి 6 వేల కోట్లు అవసరం. ఇప్పటికే గుత్తేదారులకు 400 కోట్లు పెండింగ్ పెట్టింది. ఇవి 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. చాలా చోట్ల పనులు ఆపేసేందుకు గుత్తేదారులు సిద్ధమవుతున్నారు.
జగన్ నిర్వాకంతో ప్రభుత్వ క్రెడిబులిటీ దెబ్బతిని బ్యాంకులు రుణాలిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక టిడ్కో ఇళ్లపై 9 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో 6 వేల కోట్లు లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణంగా తెచ్చుకున్నదీ, ఆర్థిక సంస్థలు అప్పుగా మంజూరు చేసినదే. నాలుగున్నరేళ్లలో బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది 1500 కోట్లు కూడా లేనట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే టిడ్కో ఇళ్లపై జగన్ ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఏటా బడ్జెట్‌లో కేటాయించే అరకొర నిధుల్ని సక్రమంగా విడుదల చేయడం లేదు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినా అప్పు ఇచ్చేందుకూ ఆర్థిక సంస్థలేవీ పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
'వామ్మో టిడ్కో ఇళ్లా? మాకొద్దు' - సీఆర్డీఏ నోటీసులతో ఉలిక్కిపడుతున్న లబ్ధిదారులు
ఫలితంగా ఇళ్ల నిర్మాణం తీవ్ర జాప్యమైంది. ఇప్పటికే రుణాలిచ్చిన బ్యాంకులకూ నమ్మకం సడలిపోయింది. బ్యాంకులకు నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించలేదు. దీంతో వాటి నుంచి లబ్ధిదారుల పేరు మీద తెచ్చుకున్న రుణం మారటోరియం గడువు తీరి, వారి బ్యాంకు ఖాతాలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి. ఇప్పటికే 5 వేల మంది ఖాతాలు ఎన్‌పీఏలు మారినట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరుకి ఆ సంఖ్య మరింత పెరుగనుంది. ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం పేదల్ని ముంచేస్తోంది. సొంతింటి గడప తొక్కకముందే నెలనెలా వాయిదాలు కట్టాల్సి వస్తోందని లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
District Wise TIDCO Houses in State:
Krishna District: గృహ రుణ వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి సంక్షిప్త సందేశాలు రావడంతో కృష్ణా జిల్లా ఉయ్యూరులోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఉయ్యూరు పరిధిలో జెమిని స్కూల్ సమీపంలో, నాగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణం ఇవ్వకుండానే బ్యాంకులు డబ్బులు కట్టాలని చెప్పడంపై లబ్దిదారులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Nellore District: నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో ఇళ్లు నిర్మాణాలు నాలుగున్నరేళ్ళ కిందట పూర్తి చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బహుళ అంతస్తుల సముదాయం అందంగా ముస్తాబు చేసి గృహప్రవేశాలు చేశారు. లబ్దిదారులకు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తాళాలు తీసుకుని బయటకు పంపించారు. నాలుగేళ్ల తరువాత బూత్ బంగ్లాగా మారిన ఇళ్ల సముదాయాన్ని లబ్దిదారులకు కేటాయించారు. మౌళిక సదుపాయలు లేక పేదలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు.
Palnadu District: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టిడ్కో కాలనీకి వెళ్లాలంటే సరైన రోడ్డుండదు. వీధి దీపాలు వెలగవు. చెత్త ఎప్పుడు తీస్తారో తెలియదు. పిల్లలకు బడి లేదు. ప్రజలకు ఆసుపత్రి లేదు. ఆకతాయిల గొడవలు, మందుబాబుల వేధింపులతో రోడ్డుపైకి రావాలంటే భయం. ఇలాంటి సమస్యలతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు.
సమస్యల నడుమ కాలం వెళ్లదీస్తున్న టిడ్కో లబ్ధిదారులు - తీసుకొచ్చి నరకంలో పడేశారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం
Srikakulam District: శ్రీకాకులంలో టీడీపీ హయంలో నిర్మించిన టీడ్కో ఇళ్లను ఏళ్లతరబడి నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న వేళ లబ్ధిదారులకు హడవడిగా అప్పగించింది, అయితే వందలాది ఎల్ల సముదాయాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేకపోయింది దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
Anantapur District: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా ఎనిమిది చోట్ల టిడ్కో ఇళ్లను నిర్మాణం చేశారు .మౌలిక సౌకర్యాలు కల్పించకుండానే ఎన్నికల్లోపు గృహ ప్రవేశాలు చేయించే ఆలోచన చేస్తున్నట్లు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా సౌకర్యాలు లేకుండా ఇచ్చే ఇళ్లలో ఏ విధంగా నివశించగలమని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు.
Nandyala District: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పురపాలక సంఘం పరిధిలో టిడ్కో గృహ సముదాయాల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. రెండు నెలల కిందట మంత్రులు ఆదిమూలపు సురేష్ బుగ్గన రాజేంద్రనాథ్ అంజాద్ భాష చేతుల మీదుగా ఈ గృహ సముదాయాలను ప్రారంభించారు. ఘనంగా ప్రారంభించి నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల చేరిక మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కడప, తిరుపతి జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి.