CM JAGAN MEETING WITH CRDA AUTHORITY: ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 33వ C.R.D.A. అథారిటీ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపారు. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అమరావతిలో "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సీఎం జగన్ జీవో జారీ చేశారు. అమరావతిలో 11వందల34.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయింపు చేశారు. మొత్తం 20 లే అవుట్లలోని స్థలాలను గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48 వేల 218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలనీ నిర్ణయించారు.
ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో .. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం తెలిపారు. మే మొదటి వారంలోగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
జీవో నెం45 పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్: మరోవైపు రాజధాని పరిధిలో ఇతర జిల్లాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం తెచ్చిన జీవో 45పై.. రాజధాని రైతు ఐకాస నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీవో 45పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్డీఏ(CRDA) పరిధిలో 11 వందల 30 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని.. గతంలో ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, N.T.R. జిల్లాల కలెక్టర్లకు భూమి అప్పగించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. మార్చి 31న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ జీవోని విడుదల చేశారు. భూమి విలువ 11 వందల 62 కోట్ల రూపాయలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. తమ భూముల్లో.. ఇతరులు ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారంటూ.. రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని రైతుల పిటిషన్ నేడు మధ్యాహ్నం విచారణకు రానుంది. అయితే ఓ వైపు రాజధాని రైతుల పిటిషన్.. మరోవైపు సీఎం జగన్ నిర్ణయాలతో ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం.. హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: