రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ గుంటూరు పర్యటన దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది.
పార్టీ నేతలతో మాట్లాడిన సీఎం..విభజన గాయాలపై కారం చల్లెందుకే ప్రధాని పర్యటనన్నారు. గుంటూరు సభకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి నిరసనలు తెలపాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. గాంధీ స్ఫూర్తితో పసుపు రంగు దుస్తులు ధరించి నిరసన తెలపాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకే రాష్ట్రంలో మోదీ పర్యటిస్తున్న చంద్రబాబు, కార్యకర్తలు మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధానిపై జగన్ ఒక్క మాటా మాట్లాడరన్న సీఎం..వైకాపా, భాజపావి కుమ్మక్కు రాజకీయాలని విమర్శించారు. రెండేళ్లుగా శాసనసభ గడపతొక్కని ప్రతిపక్ష పార్టీకి ప్రజాసేవ చేసే అర్హతలేదన్నారు.
టెలీకాన్ఫరెన్సులో పార్టీ నేతలతో మాట్లాడిన సీఎం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా దార్శనికపత్రం 2029 రూపొందించామన్నారు. పేదవారి ఇంటి కలను నెరవేరుస్తామన్న సీఎం...గృహ నిర్మాణానికి రూ.80 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.