10th Class Exams: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక నిమిషం నిబంధనతో... అనేకచోట్ల విద్యార్థులు...పరీక్షా కేంద్రాలకు పరుగులు తీశారు. ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు కూడా... కొన్ని కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. ఆత్మకూరులో పొగతో విద్యార్థులు అవస్థలు పడగా... తిరుపతి జిల్లా నాయుడుపేటలో వసతుల లేమి ఇబ్బందులకు గురిచేసింది.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది. మొత్తం 3 వేల 349 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచి ఆరుపేపర్ల విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు చాలా దూరం వరకు బారులు తీరారు. విశాఖలో పరీక్ష కేంద్రాల చిరునామాల విషయంలో కొన్నిచోట్ల గందరగోళం నెలకొంది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతంగా హాల్ టికెట్‌లో రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. హడావుడిగా తమ పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు తీశారు. పశ్చిమగోదావరి జిల్లా అయోధ్య లంకకు చెందిన విద్యార్థులు పడవలపై వశిష్ట గోదావరి నదిని దాటి పరీక్షలకు హాజరయ్యారు.
గుంటూరు ఎల్ఐసీ కాలనీలోని ఆక్సీలియం పాఠశాలలో చేయి విరిగిన విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. ప్రవీణ్ అనే విద్యార్థి సైకిల్ నుంచి కిందపడి ఎముక విరగడంతో కాళ్లకు చికిత్స జరిగింది. నడవలేని పరిస్థితుల్లో ఉన్నందున.. తల్లిదండ్రులు మంచంపైనే పరీక్ష రాసేందుకు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత ఆవరణలో చెత్తను తగలబెట్టడంతో.. గదులన్నీ పొగమయమయ్యాయి. పొగ అలుముకోవటంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులే చెత్తపై నీళ్లు పోసి మంటల్ని అదుపు చేశారు. పరీక్ష నిర్వహణ సరిగా లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో బెంచీలు సరిపోకపోవడం వల్ల... స్టూళ్లు వేశారు. వాటిపై కూర్చుని పరీక్ష రాయడానికి విద్యార్థులు అవస్థలు పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని ముదిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... ప్రమాదానికి గురైన విద్యార్థి హాజరయ్యాడు. గత నెల 26న బైక్‌పై వెళ్తూ ముఖేశ్ అనే విద్యార్థికి ప్రమాదం జరగడంతో.. ఆస్పత్రి పాలయ్యాడు. ఐనా పరీక్షలు రాస్తానని పట్టుపట్టడంతో.. తల్లిదండ్రులు కేంద్రానికి తీసుకువచ్చారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో జరిగిన రోడ్డు ప్రమాదంలో.... ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యయి. హావళిగి గ్రామానికి చెందిన మల్లికార్జున, వంశీ పదో తరగతి పరీక్షలు రాసేందుకు బైక్ పై వెళ్తుండగా కారు ఢీ కొట్టింది. గాయపడిన వారిని స్థానికులు ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: