గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం షోలాయపాలెం గ్రామంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఉత్సవాల్లో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైకాపా వర్గీయులు నిమజ్జన నిబంధనలను అతిక్రమిస్తూ..డీజే, ఆర్కెస్ట్రాతో ఊరేగింపు చేశారని స్థానికులు ఆరోపించారు. అంతేకాక అధికార అహంకారంతో తెదేపా వర్గీయులను రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసి ఘర్షణకు పాల్పడినట్లు బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పథకం ప్రకారం గణేష్ ఉత్సవ ఊరేగింపులో తమ ఇళ్ల వద్ద నుండి వెళ్తూ.. రెచ్చగొట్టే ఆరోపణలు, దూషణలకు పాల్పడ్డారన్నారు. తమ పార్టీ అధికారంలో ఉండగా మీరు ఊర్లో ఉండడానికి వీలు లేదంటూ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించి ఆస్తులు ధ్వంసం చేశారని వాపోయారు.
ప్రాధేయపడుతున్నా వినకుండా...కర్రలతో తమపై దాడులు చేసినట్లు మహిళలు ఆరోపించారు. రాళ్లు, మారణాయుధాలతో ఇళ్లపై దాడి చేసి.. ఊర్లో ఉండటానికి వీలు లేదని దౌర్జన్యం చేయటంతో ప్రాణాలు రక్షించుకోవడానికి మగవాళ్లు రాత్రి నుండి అడవిలోకి వెళ్లి తలదాచుకుంటున్నట్లు బాధిత మహిళలు రోదిస్తూ విలపించారు.
ఇదీ చదవండి : కోడెల శివప్రసాద్ రావు ద్వితీయ వర్ధంతి..తెదేపా నేతల నివాళులు